అమెజాన్ లో ట్రైబల్ పెయింటింగ్స్ : ధర ఎంతంటే?
ఆదివాసీల కళకు అమెజాన్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఆదివాసీలు వేసిన పెయింటింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే కళాభిమానులను ఆదరణను చూరగొంటున్నాయి.

ఆదివాసీల కళకు అమెజాన్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఆదివాసీలు వేసిన పెయింటింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే కళాభిమానులను ఆదరణను చూరగొంటున్నాయి.
ఇప్పుడు అంతా డిజిటల్ మయం. ఏ ప్రొడక్ట్ సేల్ చేయాలన్నా ఆన్ లైన్ బ్రహ్మస్తం. అందుకే ప్రతిఒక్కరూ ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నారు. ఈ కామర్స్ ప్లాట్ ఫాం వచ్చాక ఆన్ లైన్ షాపింగ్ లు జోరుందుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు తమ ప్లాట్ ఫాం నుంచి ఎన్నో రకాల ప్రొడక్ట్ లను షాపింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సేవలను అందిస్తోన్న అమెజాన్ లో ఆదివాసీల పెయింటింగ్ సేల్స్ కు రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతుంది.
ట్రిబల్స్ కు గుడ్ ఛాన్స్
ఆదివాసీలు గతంలో వేసిన పెయింటింగ్‌లు కావాల్సిన వారికి విక్రయించే వారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ సదుపాయం కలగటంతో ఇష్టమైనవారు తమకు నచ్చిన పెయింటింగ్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ఆదివాసీల పెయింటింగ్ లకు ఈ ఆన్ లైన్ అవకాశాన్ని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ అధికారులు కల్పించారు. ట్రైబల్ పెయింటింగ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఇప్పటి వరకు పది చిత్రాలను అమెజాన్‌లో విక్రయానికి పెట్టగా ఆరు అమ్ముడుపోయాయి.
ఒక్కో పెయింటింగ్ ధర రూ.6,500
హైదరాబాద్ ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ నేతృత్వంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా మేడారం మ్యూజియంలో కొంత మంది ఆదివాసీ కళాకారులకు పెయింటింగ్‌లు వేసేందుకు నిధులను సమకూర్చారు. దీంతో కొంత మంది కళాకారులు చిత్రాలు వేసి అమెజాన్‌లో అమ్మకానికి పెట్టి..ఒక్కో చిత్రానికి రూ.6,500 ధర నిర్ణయించారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని ఆదివాసీ కళాకారులకు అందించేలా గిరిజన సంక్షేమ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి ఆదివాసీలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ సహకారంతో మరిన్ని చిత్రాలు వేసి విక్రయిస్తామని పేర్కొంటున్నారు.
ఆదివాసీ, గిరిజన కళాకారులు రూపొందించిన చిత్రాలను వారే స్వయంగా విక్రయించేందుకు ప్రత్యేక సంతలు..డైలీ మార్కెట్స్ వంటి పలు సదుపాయాలను కల్పించనున్నారు. దీని కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో స్టాల్స్ వంటివి ఏర్పాటు చేసి ఆదివాసీలే స్వయంగా వారి పెయింటింగ్స్ ను విక్రయించుకునేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ పెయింటింగ్స్ విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ఆదవాసీలంతా సమానంగా పంచుకునేలా కూడా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.