టీటీడీ భారీ విరాళం: జిల్లాకు రూ. కోటి

దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించడంతో చిన్నా చితక పనులు చేసుకునే వాళ్లకు తిండి దొరకని పరిస్థితి. లాక్ డౌన్ దెబ్బకు పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ విరాళం ప్రకటించింది.
టీటీడీ అన్నదానం ట్రస్టు నుంచి జిల్లాకు రూ. కోటి చొప్పున ఒక్కొక్క జిల్లాకు విరాళంగా అందించింది. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కార్మికులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని, వారి ఆకలి తీర్చాలని అందుకోసం పేదలకు అన్నదానం నిమిత్తం ఈ నిధులను వినియోగించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా తినడానికి తిండి లేకుండా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం రూ.13 కోట్లు విడుదల చేస్తోంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ఈవో అనిల్ సింఘాల్ వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు రూ.1 కోటి చొప్పున.. ఆ జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు అందచేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే లాక్‌డౌన్ గడువును పొడిగించడంతో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని మే 3వ తేదీ వరకు నిలిపివేసినట్లు సింఘాల్ తెలిపారు.