ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం చాలా మంచిది

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం చాలా మంచిదని డిప్యూటీ సీఎం రామస్వామి 10టీవీకి తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం అంతా అభివృద్ధి జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి జరుగుతుందన్నారు.
రాయలసీమ డెవలప్ మెంట్ సీఎం జగన్ పాలనతోనే సాధ్యమని అన్నారు. రాజధాని అమరావతి విషయంలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన అవినీతి ఇప్పుడిప్పుడే బైటపడుతోందనీ.. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారంటూ రామస్వామి ఆరోపించారు.
కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున సీఎం జగన్ మాట్లాడుతూ..ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సష్టిస్తోంది. దీనిపై ప్రతిపక్షం తీవ్రంగా మండిపడుతోంది. రాష్ట్రప్రజల్లో తీవ్రమైన కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి భూమిలిచ్చిన రైతన్నలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీఎంలు మారితే రాజధానులు మార్చేస్తారా అంటే మండిపడుతున్నారు. కానీ అధికార పక్ష నాయకులు మాత్రం సీఎం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖపట్నం, జ్యుడిషియల్ కేపిటల్ గా కర్నూలు, లెజిస్లేటివ్ కేపిటల్ గా అమరావతి ఉండొచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.