రాజుల జిల్లా టీడీపీ ఖిల్లా..! : సైకిలెక్కేసిన సంస్ధానాధీశులు

రాజకీయాల్లో మిత్రులుండరు..శత్రువులుండరు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు రాజకీయ పార్టీల్లో పదవులను అనుభవించిన వారంతా..ఇప్పుడు ఒకే గొడుకు కిందకు చేరి చేయి చేయి కలుపుతున్నారు. విజయనగరం జిల్లాలోని నలుగురు ప్రధాన సంస్థానాధీశులు టీడీపీ పార్టీలో చేరి.. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. నాటి వైరాన్ని, రాజకీయ ద్వేషాలను పక్కన పెట్టడం గమనార్హం.
విజయనగరం సంస్థానాదీశులు :
విజయనగరం, బొబ్బిలి, కురుపాం, చినమేరంగి సంస్థానాలు ప్రధానం. విజయనగరం సంస్థానాదీశులు నాటి రాచరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ తమ ప్రతిష్టను కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా విజయనగరం సంస్థానాదీశులు ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీకి పెద్ద దిక్కు. 1978లో జనతా పార్టీ నుంచి విధాన సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 1982లో టీడీపీలో చేరారు. ఇదే పార్టీలో కొనసాగుతూ.. వివిధ పదవులను అనుభవించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 ఎన్నికల్లో తప్ప.. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చారు.
బొబ్బిలి సంస్థానం :
శౌర్యప్రతాపాల గడ్డగా పిలిచే బొబ్బిలి సంస్థానాదీశులు కూడా .. నాటి నుంచి నేటి వరకు తమ ప్రతిష్టను పెంచుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయ కృష్ణ రంగారావు కుటుంబం..మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఈ పార్టీ నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికలకు ముందు సుజయ వైసీపీలో చేరి విజయం సాధించారు. అయితే…వైసీపీ సీనియర్ నేత బొత్స ఫ్యామిలీతో రాజకీయ వైరం ఉంది. ఆ పార్టీని వీడిన సుజయ కృష్ణ టీడీపీలోకి జంప్ అయ్యారు.
చినమేరంగి సంస్థానం :
మాజీ మంత్రి శత్రుచర్ల కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంది. ఈయన కాంగ్రెస్ పార్టీలో పలు పదవులను అనుభవించారు. మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులను చేపట్టారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. ఈయన కూడా టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు.
కురుపాం జమిందారు :
కురుపాం జమిందారు వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా అశోక్ గజపతిరాజుతో చేతులు కలిపి, త్వరలో సైకిల్ ఎక్కనున్నారు. సుమారు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పని చేసి, వివిధ పదవులను అనుభవించారు. ఇటీవలనే ఆయన విజయనగరం సంస్థానాదీశులు అశోక్ గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిసి.. టీడీపీలోకి తన రాకపై సంసిద్ధను తెలిపారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదైన కిశోర్ చంద్రదేవ్ కూడా ఇలా పార్టీ మారి సైకిల్ ఎక్కుతుండటం .. రాజకీయాల్లోనే ఒక కొత్త అధ్యాయానికి తెరతీసినట్లైంది.
మొత్తం మీద నాటి సమైకాంధ్రా ఉద్యమం ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో.. చేసేది లేక కాకలు తీరిన నేతలు సైతం ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. రాజుల జిల్లా అయిన విజయనగరం.. ఇప్పుడు టీడీపీ ఖిల్లాగా మారిపోయిందనే చర్చ జరుగుతోంది.