ఖమ్మంలో గెలుపెవరిది?

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పండుగ ముగిసింది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షింప్తమైంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 75.61 శాతం పోలింగ్ నమోదవగా.. మహబూబాబాద్ నియోజకవర్గంలో 68.65 శాతం నమోదైంది. ఈవీఎంలను స్ర్టాంగ్ రూమ్స్ తరలించారు అధికారులు.
ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగింసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ అత్యంత ఉత్కంఠ కలిగించింది. ప్రధాన రాజకీయ పక్షాల నేతలకు పోలింగ్ సరళి అంతుపట్టని రీతిలో ఉన్నా విజయావకాశలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం మాత్రం గణనీయంగా పడిపోవడం రాజకీయ పక్షాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 15 లక్షల 13 వేల 94 ఓట్లు ఉండగా దాదాపు 11 లక్షల 44 వేల 51 వరకు ఓట్లు పోలైనట్లు సమాచారం. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేటలో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఎండల నేపథ్యంలో ఉదయాన్నే ఓటర్లు ఉత్సాహంగా కేంద్రాలకు తరలిరాగా మధ్యాహ్నానికి మందగించారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత మళ్లీ వేగం పుంజుకుంది.
అభ్యర్థుల భవితవ్యాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఎవరు విజేతో తెలియాలంటే 42 రోజులపాటు నిరీక్షించాల్సిందే. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను ఆయా రిసెప్షన్ కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి ఖమ్మం నగర సమీపంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించారు.
మరోవైపు ఈసారి విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు పడ్డాయని తెలిపారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి కూడా తన గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మంలో చరిత్రాత్మక తీర్పు రాబోతోందని జోస్యం చెప్పారు. మొత్తానికి ఖమ్మం పార్లమెంట్ స్థానాకి జరిగిన ఎన్నికలో ఓటరు దేవుళ్లు ఎవరికి పట్టం కడతారో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఫలితాలు తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.