పవన్ కల్యాణ్ మౌనం : జనసైనికుల్లో అనుమానం, అయోమయం

  • Published By: veegamteam ,Published On : April 16, 2019 / 03:55 PM IST
పవన్ కల్యాణ్ మౌనం : జనసైనికుల్లో అనుమానం, అయోమయం

Updated On : April 16, 2019 / 3:55 PM IST

ఎన్నికలకు ముందు.. ఎన్నికల ప్రచారంలో ఉన్న ధీమా.. ఇప్పుడు జనసేనానిలో లేదా..?  ఏపీలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమన్న అనుమానంతోనే .. మౌనం దాల్చారా..? ఇదే ఇప్పుడు జనసైనికుల్లో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇంతకాలం తమదే గెలుపంటూ చెప్పుకున్న జనసేన కార్యకర్తలు.. అధినేతే మౌనం దాల్చడంతో అయోమయంలో పడిపోయారు.

రాష్ట్రంలో పోలింగ్‌ ముగియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌….గెలుపు తమదేనంటూ ప్రకటించుకున్నారు. 2014 ఎన్నికల కంటే…ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగడం తమకే లాభిస్తుందని చంద్రబాబు, జగన్‌ అంచనా వేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు పొందుతున్న వారే…టీడీపీకి ఓటు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వృద్ధులు, వికలాంగులు, రైతులు, మహిళలందరూ…ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని చంద్రబాబు విమర్శిస్తుంటే…అదే సమయంలో ఎన్నికలు బాగా నిర్వహించారంటూ ఈసీకి కితాబిచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.  

ఎన్నికల నిర్వహణ, గెలుపుపై టీడీపీ, వైసీపీ నేతలు ఎంత హడావిడి చేస్తున్నా….జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మాత్రం సైలెంట్‌ అయిపోయారు. పోలింగ్‌లో గొడవలు, దాడులు, ఈవీఎంల మొరాయింపు, పోలింగ్‌ శాతం పెరగడంపై పార్టీ నేతలతో పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి రివ్యూలు నిర్వహించలేదు. నెల రోజులకు పైగా విరామం లేకుండా గడిపిన పవన్‌…ఉన్నట్టుండి అజ్ఞాతవాసిగా మారిపోయారు. ఎన్నికలపై రాష్ట్రంలో రచ్చ రచ్చవుతుంటే… పవన్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీలోని కీలక నేతలకు కూడా ఆయన సమయం ఇవ్వడం లేదని తెలుస్తోంది. వారం పది రోజుల వరకూ తనను ఎవరూ కలిసే ప్రయత్నం చేయవద్దంటూ పవన్ చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఎన్నికల్లో పార్టీ ప‌రిస్థితిపై పవన్‌ అంచ‌నాలు వేసుకుంటున్నా…పార్టీలో మ‌రో టాక్ వినిపిస్తోంది. ఎన్నిక‌ల ముందు పోల్ మేనేజ్ మెంట్‌లో పూర్తిగా విఫ‌లమయ్యామ‌నే భావ‌న మెజార్టీ నేత‌ల్లో వ్యక్తమవుతోంది. రెండు బ‌ల‌మైన పార్టీల మ‌ధ్య జ‌న‌సేన…తడబడిందని విశ్లేషకులు చెబుతున్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లలేదన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. కొత్త పార్టీ కావ‌డం, మొదటిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌డంతో మెరుగైన ఫలితాలు వ‌స్తాయో లేదోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. పవన్ కళ్యాణ్‌కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌ తోనైనా 10 వరకూ సీట్లు రావచ్చని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా అంచనాకు వస్తున్నారు. ప్రధానంగా విశాఖ, నర్సాపురం లోక్‌సభ స్థానాల ఫలితాలు తమకు అనుకూలంగా ఉండొచ్చనుకుంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని సీట్లైనా దక్కవచ్చనుకుంటున్నారు. ఎన్నికల వరకూ జోరుగా తిరిగిన పవన్‌.. కాస్త జనంలోకి వస్తే.. జనసైనికుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్న భావనలో ఉన్నారు పార్టీ నేతలు.