గెలుస్తారా : అందరి చూపు పవన్ వైపే

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 07:03 AM IST
గెలుస్తారా : అందరి చూపు పవన్ వైపే

Updated On : April 12, 2019 / 7:03 AM IST

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఓటింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం అయ్యింది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు అనేది పక్కన పెడితే.. అందరి చూపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైనే ఉంది. తొలిసారి జనసేన ఎన్నికల బరిలోకి దిగింది. పవన్ కళ్యాణ్ విశాఖలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. గాజువాక నియోజకవర్గంలో పోలింగ్‌ సరళి ఉత్కంఠభరింతంగా సాగింది. పవన్ గెలుస్తారా? లేదా? అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది.

3లక్షల 9వేల 326 ఓటర్లతో విశాఖ జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. పవన్ కి పల్లా నుంచి తీవ్ర పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీనిచ్చారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన నాగిరెడ్డి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు. వయసురీత్యా పెద్దవారైన నాగిరెడ్డి.. ఈసారి తాను గెలవకపోతే మరో ఐదేళ్ల తర్వాత తాను పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లకు చెబుతూ వచ్చారు. దీనికి తోడు వైసీపీ శ్రేణులు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యూహం ప్రకారం వెళ్లారు. దీంతోపాటు పవన్‌ కు గాజువాకలో మొదట్నుంచి పలు అవాంతరాలు ఎదురయ్యాయి. బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం లేకపోవడం మైనస్ గా మారాయి.

పోలింగ్‌ సందర్భంగా నెలకొన్న పరిస్థితులూ పవన్‌ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని అనుకుంటున్నారు. చాలామంది పవన్‌ అభిమానులు పోలింగ్‌ బూత్‌లకు వచ్చినా.. ఈవీఎంలు మొరాయించడంతో వెనక్కి వెళ్లిపోయారట. ఓటు వేయడానికి క్యూలైన్లలో గంటలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితుల్లో చాలామంది నిష్క్రమించారని సమాచారం. ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో చాలామంది ఓటింగ్‌కు హాజరుకాలేదు. పవన్‌కు గంగవరం, అగనంపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, మింది, వడ్లపూడి తదితర ప్రాంతాల నుంచి గట్టి మద్దతు లభించినట్టు తెలుస్తోంది.  అంతిమంగా ఈ పరిణామాలు పవన్ గెలుపు ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.