ఎక్కడ బాస్ ఎక్కడ : మందు కొంటే చికెన్ పకోడి ఫ్రీ

  • Published By: chvmurthy ,Published On : September 28, 2019 / 11:08 AM IST
ఎక్కడ బాస్ ఎక్కడ : మందు కొంటే చికెన్ పకోడి ఫ్రీ

Updated On : September 28, 2019 / 11:08 AM IST

ఏపీలో అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తోంది.  ప్రస్తుతం 450 మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అక్టోబరు 1 నుంచి వీటి సంఖ్య3వేల 500 కానుంది.  వీటిని నిర్వహించడానికి సర్కారు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలను చేసింది.  మరోవైపు  రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం చేసే యోచనలో ప్రభుత్వం  ఉంది. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు   పని చేయనున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల సంఖ్యను 20 శాతం తగ్గించింది.  దీనివల్ల చాలా షాపులు మూత పడనున్నాయి.  లైసెన్స్ తిరిగి రెన్యువల్ చేయించుకోని షాపులు,  ప్రభుత్వ అనుమతి లేని షాపుల్లోని మద్యం క్లియర్ చేసుకోటానికి వ్యాపారస్తులు సమాయత్తమవుతున్నారు.  కొత్త మద్యం పాలసీ వచ్చి స్టాక్ మిగిలిపోతే, ఆ స్టాక్ ను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి సొమ్ములు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, యజమానులు షాపుల్లోనే స్టాక్ క్లియర్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు.  

మద్యం ప్రియులకు కిక్కెంచేందుకు వైన్ షాపు  యజమానులు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సెప్టంబరు 30 తో పాత మద్యం పాలసీ ముగుస్తుండటంతో  షాపుల్లో ఉన్న మద్యాన్ని క్లియర్ చేసుకోటానికి షాపు యజమానులు తక్కువ రేట్లకే మధ్యం అమ్మకాలు సాగిస్తుండగా మరి కొందరు మద్యం కొనుగోలు చేస్తే స్నాక్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే మద్యాన్ని విక్రయిస్తున్నారు. మద్యాన్ని షాపు దగ్గరే  తాగే వారికి అదనంగా కోడి గుడ్లు, కోడి పకోడి, అరటిపళ్లు వంటి స్నాక్స్‌ను ఉచితంగా అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు. 

కొంతమంది యజమానులు మద్యం షాపుల్లో గత నెల రోజుల నుంచి తక్కువ సరుకు పెడుతున్నప్పటికీ మద్యం జోరుగా విక్రయాలు జరిగే షాపుల్లో పెద్ద మొత్తంలో సరుకు నిల్వలున్నట్లు చెబుతున్నారు. దీనితో గడువు ముంచుకొస్తున్నందున సరుకును వదిలించుకునేందుకు ఆఫర్లు ప్రకటించనున్నారని చెబుతున్నారు. అయితే కొంతమంది సిండికేట్‌గా ఉన్న షాపుల యజమానులు తమ వద్ద మద్యం సరుకును సభ్యుల సంఖ్యను బట్టి వాటాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా మరికొంతమంది స్నేహితులు, బంధువులకు పంపకాలు చేయడానికి నిర్ణయించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద మద్యం పాలసీ మారడంతో మద్యం ప్రియులకు తక్కువ ధరకే మద్యం లభించడంతో పాటు ఉచితాలు కూడా దక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది.