సింగరేణిలో సబల : గనుల యాజమాన్యాలకు షరతులు

ఆదిలాబాద్ : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు ఇక నుంచి భూగర్భ గనుల్లో కూడా పనిచేయనున్నారు. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని కేంద్రం తొలిసారిగా పురుషులతో సమానంగా… మహిళలకు భూగర్భ గనుల్లో పని చేసే అవకాశం కల్పించింది. భూగర్భ గనుల్లో మహిళలు పని చేసేందుకు అడ్డుగా ఉన్న గనుల చట్టం 1952 నిబంధనను సవరిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. ఆకాశంలో సగం అయిన మహిళలు.. ఇక భూగర్భ గనుల్లోనూ పనిచేయనున్నారు. ఉపరితల గనుల్లోనే కాకుండా భూగర్భ గనుల్లోనూ మహిళలు పని చేయడానికి అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటవలే గెజిట్ జారీ చేసింది. దీంతో బొగ్గు గనులు, చమురు క్షేత్రాలు, మైకా బంగారం, ఇనుప ఖనిజాలు లభించే గనుల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ రంగంలో కూడా మహిళల్ని అనుమతించినప్పటికీ కేంద్రం.. గనుల యాజమాన్యాలకు కొన్ని షరతులు విధించింది.
ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు
ఉపరితల గనుల్లో మహిళలకు అనుమతి
24 గంటలు పనిచేసేందుకు అనుమతి
కోల్ ఇండియాలో మహిళలు ఉపరితల బొగ్గు గనుల్లో షవల్ ఆపరేటర్లుగా, ఈపీ ఆపరేటర్లుగా పనిచేస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఉపరితల గనుల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మహిళలకు అనుమతి ఉంది. సాయంత్రం 7 దాటితే మహిళలు ఇక్కడ పని చేయడానికి అనుమతి లేదు. అయితే కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై మహిళలు 24 గంటలు పని చేసేందుకు అనుమతి లభించింది. ఈ విషయంలో సంబంధిత మహిళ నుంచి రాతపూర్వకంగా ముందస్తు అనుమతి తీసుకుని సాయంత్రం ఏడు దాటిన తరువాత పనిచేయడానికి అవకాశం కల్పించనున్నారు. అయితే భూగర్భ గనుల్లో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు మహిళలు. తమకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే తాము మగవారికేం తీసిపోమంటున్నారు.
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలకు భూగర్భగనుల్లోకి అనుమతించడం వల్ల వారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం దొరికిందంటున్నారు కార్మిక సంఘం నాయకులు. కేంద్రం నిర్ణయంతో వారసత్వ ఉద్యోగాల్లో మహిళలకు కూడా అవకాశం రానుందంటున్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడే మహిళలకు ఇప్పుడు భూగర్భ గనుల్లో కూడా పని చేసే అవకాశం లభించడంపై మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.