బొత్స ఇంట పెళ్లికి హాజరైన జగన్ : సీఎం నినాదాల హోరు

  • Published By: veegamteam ,Published On : April 28, 2019 / 04:09 AM IST
బొత్స ఇంట పెళ్లికి హాజరైన జగన్ : సీఎం నినాదాల హోరు

Updated On : April 28, 2019 / 4:09 AM IST

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం (ఏప్రిల్ 27,2019) పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబంలో జరిగిన పెళ్లికి హాజరయ్యారు. బొత్స సోదరుడు అప్పలనరసయ్య కుమార్తె యామిని  వివాహం విశాఖపట్నంకు చెందిన రవితేజతో రుషికొండ సాయిప్రియా రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి విచ్చేసిన జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ రాకతో అభిమానుల్లో ఉత్సాహం  కనిపించింది. “సీఎం, సీఎం” నినాదాలతో పెళ్లి వేదికను హోరెత్తించారు. ఓ దశలో పెళ్లిమంత్రాలు, మంగళవాయిద్యాల హోరును మించి నినాదాలు చేశారు. అభిమానుల సందడి చూసి జగన్ కూడా  ముచ్చటపడ్డారు. పెళ్లి వేదిక దగ్గర ఉన్నంతసేపు జగన్ ఫేస్ వెలిగిపోయింది. ఉత్సాహంగా కనిపించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు జగన్‌ హైదరాబాద్‌ నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటలకు విశాఖ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు, శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్ తో విరామం లేకుండా గడిపిన జగన్.. వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్లి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్‌ లో 5 రోజులు ఉన్నారు. టెన్షన్లన్నీ మర్చిపోయి  ఫ్యామిలీతో జాలీగా గడిపారు. ఏప్రిల్ 22న వెళ్లిన జగన్.. 27న తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిశాయి. ప్రజలు తమ అభిప్రాయాలను ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తం చేశారు. ఎన్నికల్లో  గెలుపెవరిదో తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.