చిన్నాన్న‌ను న‌రికి చంపారు – కేసును త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు అంటున్న జ‌గ‌న్

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 01:41 PM IST
చిన్నాన్న‌ను న‌రికి చంపారు – కేసును త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు అంటున్న జ‌గ‌న్

కడప : వివేకానంద రెడ్డి హత్య అత్యంత దారుణమని వైఎస్ జగన్ అన్నారు. తలపై ఐదు సార్లు గొడ్డలితో నరికేశారని పేర్కొన్నారు. అత్యంత దారుణమైన, రాజకీయంగా నీచమైన చర్యగా అభివర్ణించారు. వివేకానంద రెడ్డి అంత సౌమ్యుడు ఎవరూ లేదన్నారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి చిన్నాన్నను గొడ్డలితో నరికి చంపారని చెప్పారు. దీనికన్న దారుణమైన ఘటన మరోటి లేదన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తిని కిరాతకంగా చంపారని వాపోయారు.
Read Also: వివేక హత్య సూత్రదారులు చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ : విజయసాయిరెడ్డి

హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రక్తం కక్కుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెడ్ రూమ్ లో చంపేసి బాత్ రూమ్ లోకి తీసుకొచ్చి.. రక్తం పూశారని… ప్రమాదం జరిగి చనిపోయినట్లు చెప్పేందుకు పన్నాగం పన్నారన్నారు. ఒకరు కాదని.. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. 

దర్యాప్తు తీరును చూస్తే బాధనిపిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులపై నమ్మకం లేదన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ హత్యతో చాలా మందికి సంబంధాలున్నాయన్నారు.  హత్య కేసులో ఎంత పెద్దవాళ్లున్నా బయటికి రావాలని చెప్పారు. హత్యలో ఎవరున్నారని తెలియాలని..ఎందుకు చేశారో తెలియాలన్నారు.

Read Also: కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు

ఏపీ ప్రభుత్వ అధికారులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు జరుగుతున్న తీరుపై పలు అనుమానాలున్నాయని తెలిపారు. తమపై దాడులు జరిగినప్పుడు చంద్రబాబు వెటకారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. తమపై దాడులు జరిగినప్పుడల్లా చంద్రబాబే సీఎంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎటువంటి న్యాయం జరుగదని స్పష్టం చేశారు. ’మా నాన్న మృతిపై నాకు ఇప్పటికే అనుమానాలున్నాయి’ అని జగన్ అన్నారు.