షర్మిళ బాణం : పవన్ కళ్యాణ్ నటుడు.. చంద్రబాబు డైరెక్టర్

  • Published By: vamsi ,Published On : March 25, 2019 / 06:17 AM IST
షర్మిళ బాణం : పవన్ కళ్యాణ్ నటుడు.. చంద్రబాబు డైరెక్టర్

Updated On : March 25, 2019 / 6:17 AM IST

2019 ఎన్నికల ప్రచారంలోకి దిగారు వైఎస్ షర్మిళ. విజయవాడలోని పార్టీ ఆఫీసులో మాట్లాడారు. వింత రాజకీయాలు నడుస్తున్నాయన్నారామె. పవన్ కళ్యాణ్ యాక్టర్ అని, డైరెక్టర్ చెప్పినట్లే చేస్తున్నారని చురకలు అంటించారు. ఆ పొలిటికల్ డైరెక్టర్ చంద్రబాబు అంటూ విమర్శలు చేశారామె. బయటకు పొత్తు లేదని, లోపల మాత్రం పొత్తులు కుదుర్చుకున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే అని, చంద్రబాబుకు ఓటేస్తే జనసేనకు ఓటేసినట్లు అని వివరించారు.

ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో కలకలలాడిన రాష్ట్రమేనా ఇదేనా? అనే అనుమానం కలుగుతుందని వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిళ ఆవేదన వ్యక్తం చేసింది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హాయాంలో ప్రతీ మహిళకు భరోసా ఉండేదని, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రతీ ఒక్కరికి ఆమోదయోగ్యమైన పాలన అందించారని, ఇలా ముందుకు పోతున్నాం.. అలా ముందుకు పోతున్నాం అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు మాత్రం రాష్ట్రాన్ని పాతికేళ్ల వెనుకకు చంద్రబాబు నెట్టారని షర్మిళ ఆరోపించారు.

రైతులకు ఉన్న 27వేల కోట్ల అప్పుని.. కమిటీ వేసి 24వేల కోట్లుగా మార్చారని.. అది కూడా పూర్తి ఇవ్వలేదన్నారమె. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణ మాఫీ చేస్తానని చెప్పి.. మహిళలలను మోసం చేశారని అన్నారు. రూ.6వేల కోట్లను మాత్రం పసుపు కుంకుమ పేరుతో బిక్షం వేసి మహిళలను వంచన చేశారని దుయ్యబట్టారు షర్మిళ. పోలవరం కాస్ట్‌ని పెంచేశారని, చంద్రబాబు మాట మీద నిలబడి ఉంటే పోలవరంను కట్టేవారు కదా? అని ప్రశ్నించారు.

అమరావతి భూములను లాక్కుని, 4వేల ఎకరాలను ఉచితంగా తన బినామీలను కట్టబెట్టారని అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్‌లను చూపించడం తప్ప.. అమరావతిలో శాశ్విత భవనం కట్టారా? అని నిలదీశారు. చంద్రబాబు మాత్రం తనకోసం పర్మినెంట్ బిల్డింగ్ కట్టుకున్నారని ఆరోపించారు. పేద విద్యార్ధులకు ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ ఆగిపోయి చదువులు ఆపేశారని అన్నారు.

పేదవాడిని కార్పొరేట్ ఆసుపత్రికి దూరం చేసి.. గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లేలా చేయడం అన్యాయం కాదా? అని నిలదీశారు. బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు. బాబు వచ్చాక తన కొడుకుకు మాత్రమే జాబు ఇచ్చారని, కొడుకు లోకేష్‌కు మంత్రి శాఖ ఇచ్చారని అన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తికి మూడు శాఖలు ఇవ్వడం న్యాయమా? అని అన్నారు. బీజేపీ చెవిలో పూలు పెట్టిందంటే అందుకు కారణం చంద్రబాబు కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు సిగ్గుగా లేదా? హోదా కోసం పోరాడుతుంటే జైలులో పెడుతామని అనలేదా? ఏపీలో గత ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చారని, కొత్త అబద్దాలు.. మోసపు హామీలు.. మళ్లీ ఇప్పుడు ఇస్తున్నారని అన్నారు.