ప్రాణాలు గుప్పిట్లో : బుట్టలో గర్భిణిని వరదతో ఉదృతిలో నది దాటించిన దుస్థితి

  • Published By: nagamani ,Published On : August 2, 2020 / 01:03 PM IST
ప్రాణాలు గుప్పిట్లో : బుట్టలో గర్భిణిని వరదతో ఉదృతిలో నది దాటించిన  దుస్థితి

అమ్మ కడుపులో రూపుదిద్దుకున్న ఓ శిశువు భూమ్మీదకు రావాలంటే ఆ తల్లి పడే ప్రసవ వేదన పడే పురిటి నొప్పుల కంటే భయకరమైన బాధలను అనుభవించాల్సిన దారుణ పరిస్థితులు ఈ భారతదేశంలో ఇంకా ఉన్నాయి. బిడ్డను కనటానికి ఆస్పత్రికి వెళ్లటానికి కూడా సరైన మార్గాలులేవు. నది నీటిలో వెళ్లాల్సిందే. అటువంటి దౌర్భాగ్యపు దుస్థితి ఈ దేశంలో చాలా ప్రాంతాల్లో ఉంది.

అటువంటి దారుణ పరిస్థితుల్లో ఓ నిండు గ‌ర్భిణికి నెల‌లు నిండాయి. పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతోంది. కానీ ఆ గ్రామానికి అంబులెన్స్ వ‌చ్చే మార్గం లేదు. రోడ్డు సౌక‌ర్యం లేదు. దీంతో ఆ గ‌ర్భిణిని ఓ బుట్ట‌లో కూర్చోబెట్టి న‌దిని దాటించాల్సి వచ్చిన దుస్థితి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సూర్గుజా జిల్లాలోని కద్నాయి గ్రామంలో నిన్న చోటు చేసుకుంది.

గ‌ర్భిణిని బుట్ట‌లో కూర్చోబెట్టిన న‌లుగురు వ్య‌క్తులు.. క‌ట్టెలను కావడిగా కట్టి మోసుకెళ్లారు. ఓ పక్క న‌ది వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోపక్క ప్రసవవేదనతో తల్లడిల్లిపోతున్న తల్లి. చేసేదేమీ లేదు. మరోదారి లేదు. అలాగే ప్రాణాలకు గుప్పెట్లో పెట్టుకుని ఆ గర్భిణిని న‌దిని దాటించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.


ఈ ఘ‌ట‌న‌పై సూర్గుజా జిల్లా క‌లెక్ట‌ర్ సంజ‌య్ కుమార్ ఝా స్పందిస్తూ.. మారుమూల గ్రామాల ప్ర‌జ‌లు వ‌ర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఆలోచిస్తున్నాం. చిన్న కార్లు వారికి అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. కానీ ఈ పనులు అయ్యేనా? ఎప్పటికి అమలులోకి వస్తాయి? ఈ లోపు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలకుమాత్రం ఎన్నటికీ సమాధానం దొరకదు.