APలో నామినేషన్ల స్క్రూటీని టెన్షన్

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 12:58 AM IST
APలో నామినేషన్ల స్క్రూటీని టెన్షన్

నామినేషన్ల స్క్రూటినీ ప్రధాన పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెట్టించింది. అంతా బాగానే ఉన్నా అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు జరగడం, ప్రతిపక్ష అభ్యర్థుల అభ్యంతరాలతో కాసేపు హైడ్రామా నెలకొంది. నారా లోకేష్‌ నామినేషన్‌పై కూడా అభ్యంతరం వ్యక్తం కావడంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. అధికారులు ఇచ్చిన సమయాన్ని పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవడంతో.. నామినేషన్ల కథ సుఖాంతమైంది. 

మార్చి 25తో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో మార్చి 26వ తేదీ మంగళవారం స్క్రూటీని నిర్వహించారు. అన్ని పత్రాలను పరిశీలించిన అధికారులు సరిగా లేని వాటిని తిరస్కరించారు. చిన్నచిన్న తప్పులున్నా లేక ఏవైనా అభ్యంతరాలున్నా వాటిని పెండింగ్‌లో పెట్టారు. అభ్యర్థుల నుంచి వివరణ కోరారు. మంగళగిరి నుంచి బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. నామినేషన్‌పై రిటర్నిగ్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నోటరి గుంటూరు జిల్లాలో చెల్లదంటూ అభ్యంతరం తెలిపారు.
Read Also : అవినీతి అంతం : ప్రమాణస్వీకారం చేసిన లోక్ పాల్ సభ్యులు

నోటరీ చట్టంలోని సెక్షన్‌ 9 ప్రకారం ఆయన దాఖలు చేసిన నామపత్రం చెల్లదని పేర్కొన్నారు. అదనపు పత్రాల కోసం లోకేశ్‌కు రిటర్నింగ్‌ అధికారి 24గంటల గడువు ఇచ్చారు. వెంటనే రంగంలోకి టీడీపీ వర్గాలు…లోకేష్ నామినేషన్‌లోని లోపాలను సరిదిద్దాయి. గుంటూరు జిల్లాకు చెందిన నోటరితో అదనపు పత్రాలు  సమర్పించడంతో.. లోకేష్ నామినేషన్‌కు రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. 

అటు చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ తొలుత వివాదాస్పదమై తర్వాత సుఖాంతమైంది. నోడ్యూస్ సర్టిఫికెట్‌ను నామినేషన్‌తో పాటు జతచేయలేదని చింతల రామచంద్రారెడ్డి నామినేషన్‌పై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చింతల రిటర్నింగ్‌ అధికారికి వివరణ ఇచ్చారు. దీంతో వివాదానికి తెరపడింది. చింతల నామినేషన్‌ను  ఆమోదిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చాలాచోట్ల స్వతంత్ర అభ్యర్థులు కొన్ని చిన్నాచితకా పార్టీల అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. కొన్నిచోట్ల సరిగా నామినేషన్లు పూర్తి చేయకపోవడం ఇంకొన్ని చోట్ల అభ్యర్థుల్ని బలపరిచిన వారి వివరాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో నామినేషన్లను తిరస్కరించారు. మార్చి 27వ తేదీ బుధవారం కూడా నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 
Read Also : పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేస్తే వచ్చేది టీడీపీ కార్యకర్తలే