ఈసీ సీరియస్ : 6 తర్వాత పోలింగ్ ఎందుకు జరిగింది

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 12:27 PM IST
ఈసీ సీరియస్ : 6 తర్వాత పోలింగ్ ఎందుకు జరిగింది

విజయవాడ : ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలపై సీఈవో ద్వివేది వివరణ కోరారు. నియోజకవర్గానికి ముగ్గురు బెల్ నిపుణులను కేటాయించినా వారి సేవలను వాడకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ జరగడానికి కారణాలను రాతపూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు.  క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఏప్రిల్ 11న రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈసీ పనితీరుపై ప్రజలు, రాజకీయ నాయకులు మండిపడ్డారు. దీంతో సీఈవో సీరియస్ అయ్యారు. ఈవీఎంలలో సమస్యలు వస్తే పరిష్కరించేందుకు బెల్ ఇంజినీర్లను కేటాయించారు. అయితే పలు ప్రాంతాల్లో వారి సేవలు ఉపయోగించుకోలేదు. దీంతో పోలింగ్ ఆలస్యమైంది. పోలింగ్ తేదీకి 4 రోజుల ముందే 600మంది ఈవీఎం ఇంజినీర్లు వచ్చారు. అయినా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు రావడంపై ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరగడానికి కారణాలను రాతపూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో రిట్నరింగ్ అధికారి ఈవీఎంలను ఆలస్యంగా అప్పగించడం, రాజాంలో మైనర్లు ఓటు వేసిన సంఘటనలపై నివేదికలు పంపాలని ద్వివేది ఆదేశించారు. కలెక్టర్ల నుంచి నివేదికలు అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.