ప్రభుత్వం శుభవార్త : నెలకు రూ.5వేలు, 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ

ఏపీ సీఎం జగన్ ఆర్యోశ్రీ పథకంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 04:02 AM IST
ప్రభుత్వం శుభవార్త : నెలకు రూ.5వేలు, 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ

ఏపీ సీఎం జగన్ ఆర్యోశ్రీ పథకంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఏపీ సీఎం జగన్ ఆర్యోశ్రీ పథకంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లోని 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇస్తామన్నారు. రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లిస్తామన్నారు. గతంలో ఇలాంటి సౌకర్యం లేదన్నారు. పేదలు ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత కొన్నాళ్లు పనులకు వెళ్లలేరని, ఆ సమయంలో వారి ఇల్లు గడవడం కష్టం అవుతుందని, అందుకే మానవతా దృక్పథంతో ఈ సాయం చేస్తామని సీఎం జగన్ వివరించారు. కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరిస్తామని వెల్లడించారు. ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ బుధవారం(సెప్టెంబర్ 18,2019) సీఎంని కలిసింది. 100కు పైగా సిఫార్సులతో 182 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై 3 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. నివేదికలోని పలు అంశాలు ఆమోద ముద్ర వేశారు.

ఏపీలో ప్ర‌భుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్‌పై ప్ర‌భుత్వం నిషేధం విధించింది. పరిహారంగా వారి బేసిక్ సాలరీ పెంచే యోచనలో ఉంది. ఈ మేరకు ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. సిఫారసుల ఆధారంగా రూ. వెయ్యి ఖర్చు దాటే ప్రతి వ్యాధికి ఆరోగ్యశ్రీలో చికిత్స అందించాలని నిర్ణయించారు. 2020 జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో కూడిన ఆరోగ్యశ్రీని పైలెట్‌ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని సీఎం చెప్పారు. కొత్తగా అమలయ్యే ఆరోగ్యశ్రీ పథకంలో 2 వేల వ్యాధులకు వైద్యం అందిస్తామన్నారు. వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. అనంతరం లోటుపాట్లను సమీక్షించి 2020 ఏప్రిల్‌ 1 నుంచి అన్ని జిల్లాల్లో దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు 1200 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందుతుందన్నారు. ఆ తర్వాత 2 వేల జబ్బులను పథకం పరిధిలోకి తీసుకొస్తామన్నారు. అందరికీ ఆరోగ్యం అందాలన్న లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో డిసెంబర్‌ 21 నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని సీఎం వెల్లడించారు. 

సుజాతారావు కమిటీ నివేదికలో అంశాలు:
* హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 150 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ.
* ప్రభుత్వ డాక్టర్ల వేతనాలు పెంచి, ప్రైవేట్‌ ప్రాక్టీసుపై నిషేధం
* ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేయించుకున్న వారు కోలుకునేంత వరకు నెలకు రూ.5వేల చొప్పున సాయం.
* ప్రభుత్వాసుపత్రుల అవసరాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు కలిగిన మందులనే కొనాలి.
* డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు.
* కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి రూ.10వేల పెన్షన్. 
* ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒకే కేటగిరీ కిందకి తెచ్చి నెలకు రూ.5వేలు పెన్షన్.
* డాక్టర్ల రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్
* ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలి.
* 108, 104, ఇతర సేవలకు ఉపయోగించే వాహనాల నిర్వహణకు ప్రత్యేక అధికార యంత్రాంగం ఉండాలి.
* ఏప్రిల్‌ నుంచి 2వేల జబ్బులకు ఆరోగ్యశ్రీ.
* తలసీమియా, కుష్టు, పోలియో, పక్షవాతం, బోధకాలు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు పెన్షన్.
* స్విమ్స్‌ హెల్త్‌ వర్సిటీ ఏర్పాటుకు నిపుణుల కమిటీ సిఫార్సు.. సీఎం ఆమోదం

పెన్షన్‌ పరిధిలోకి మరికొన్ని వ్యాధులు తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తున్నారు. ఇకపై మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా నెలకు రూ.5 వేలు పింఛన్‌ ఇస్తామని సీఎం తెలిపారు. తలసేమియా, కుష్టు, పోలియో, బోధకాలు, పుట్టుకతోనే వచ్చే హెచ్‌ఐవీ, పక్షవాతం బాధితులకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇచ్చేందుకు మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.