పోలవరం భూమి కుంగుతోంది : ఐఐటీ ఎక్స్‌పర్ట్‌తో విచారణ కమిటీ – దేవినేని

  • Published By: madhu ,Published On : April 28, 2019 / 07:43 AM IST
పోలవరం భూమి కుంగుతోంది : ఐఐటీ ఎక్స్‌పర్ట్‌తో విచారణ కమిటీ – దేవినేని

పోలవరం వద్ద భూమి పగుళ్లపై ఐఐటీ ఎక్స్‌పర్ట్‌తో విచారణ కమిటీ వేయడం జరిగిందని దేవినేని ఉమ ప్రకటించారు. రిపోర్టు ఆధారంగా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయనతో పాటు ఇంజినీరింగ్ అధికారులు కూడా ఉన్నారు. పోలవరంలో పగుళ్లు ఎందుకు ఏర్పడుతున్నాయనే దానిపై ఆరా తీశారు. పోలవరం వద్ద భూమి కుంగుతూ..పగుళ్లు ఏర్పడడం కామన్ అయిపోయింది. గతంలో రెండు సార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు ఆరా తీస్తున్నారు. దేవినేని ఉమ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

ఈ సందర్భంగా 10tvతో దేవినేని మాట్లాడారు. డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్‌కు అనుగుణంగా జలవనరుల శాఖ అధికారులు ఇక్కడ పని చేస్తున్నారని తెలిపారు. డ్యామ్ డిజైన్ కమిటీ తగిన చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకొంటోందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేయవద్దని..మే 23 తర్వాత దుకాణం బంద్ చేసుకోవాలని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే..పోలవరం ప్రాజెక్టు సమీపంలో భూమి కుంగిపోతోంది. తాజాగా ఏప్రిల్ 27వ తేదీ శనివారం 902 కొండ వద్ద త్రివేణి గ్యారేజీ వద్ద భూమి కుంగిపోతూ వచ్చింది. కార్మికులు పరుగులు తీశారు. జేసీబీలు, లారీలు, ఇతర భారీ యంత్ర సామాగ్రీ కూడా భూమిలోకి వెళ్లడం గమనించారు. ఇక్కడి నుండి యంత్రాలను సురక్షిత ప్లేస్‌కు తరలించారు.