సీఎం అయ్యాక నరకం చూపిస్తున్నారు : సిటీ బస్ లో అసెంబ్లీకి వచ్చిన లోకేష్

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 03:42 AM IST
సీఎం అయ్యాక నరకం చూపిస్తున్నారు : సిటీ బస్ లో అసెంబ్లీకి వచ్చిన లోకేష్

ఆర్టీసీ చార్జీలపై పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల సమయంలో ఏ ధరలూ పెంచమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రూ.10 బస్ టికెట్ ను రూ.15కు పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరిపై  50శాతం భారం వేశారని వాపోయారు. చార్జీలు ఎందుకు పెంచారో ప్రభుత్వం చెప్పలేకపోతోందన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. అటు ఆర్టీసీ చార్జీల పెంపుని నిరసిస్తూ.. నారా లోకేష్ మంగళగిరి నుంచి అసెంబ్లీ వరకు సిటీ బస్ లో వచ్చారు.

* ఆర్టీసీ చార్జీల పెంపుపై చంద్రబాబు విమర్శలు
* అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు
* ప్రజలను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది
* ఇష్టానుసారంగా ఆర్టీసీ చార్జీలు పెంచారు
* 50శాతం చార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారు
* చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
* పెంచిన చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి

ఏపీలో పెంచిన ఆర్టీసీ చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. బుధవారం(డిసెంబర్ 11,2019) ఉదయం నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తున్నారు. డిపోల నుంచి వేకువ జామున బయటికి వచ్చే మొదటి బస్సు నుంచే పెంచిన చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. పల్లె బస్సులు, సిటీ సర్వీసుల్లో కనీస ప్రయాణ చార్జీ 5 రూపాయలేనని… వెన్నెల స్లీపర్‌ సర్వీసుల్లో ఎలాంటి పెంపు ఉండబోదని ఆర్టీసీ స్పష్టం చేసింది.

దూరప్రాంత ప్రయాణికుల్లో ఎక్కువ మంది ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ప్రతి కిలోమీటరుకు 20పైసలు పెంచిన యాజమాన్యం… తక్కువ సంఖ్యల నడిచే సర్వీసులైన ఇంద్ర, గరుడ, అమరావతి బస్సుల్లో పది పైసలు పెంచింది. దూరప్రాంత ప్రైవేటు బస్సులతో పోటీ తట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి.