సీఎం జగన్ ఢిల్లీ టూర్ : మోడీతో భేటీ : రైతు భరోసా కార్యక్రమానికి ఆహ్వానం

  • Published By: madhu ,Published On : October 5, 2019 / 11:09 AM IST
సీఎం జగన్ ఢిల్లీ టూర్ : మోడీతో భేటీ : రైతు భరోసా కార్యక్రమానికి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై కేంద్ర పెద్దలతో సమావేశమై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 4.30గంటలకు మోడీతో జగన్ భేటీ అయ్యారు. అక్టోబర్ రెండో వారం నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్న జగన్.. ఆ మేరకు ఆహ్వానం అందించనున్నారు. 

పోలవరం, విద్యుత్ కొనుగోళ్లు సహా రీటెండరింగ్‌ అంశాలపై చర్చిస్తున్నారు. పోలవరం రీటెండరింగ్‌లో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదా జరిగిన విషయాన్ని మోదీకి వివరించనున్నారు. విద్యుత్ కొనుగోళ్ల అగ్రిమెంట్ల విషయంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పీపీఏల విషయంలో కేంద్రమంత్రి లేఖలు రాయడం, తమకు తోచిన విధంగా స్టేట్ మెంట్లు ఇవ్వడంతో రాజుకున్న వివాదాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

రెవెన్యూ లోటు సహా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానితో జగన్ చర్చించారు. రెవిన్యూ లోటు భర్తీకి సహకరించాలని కోరారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌కు ఆర్ధిక సాయం చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏపీలో చేపడుతున్న అనేక సంక్షేమ కార్యకమాల వల్ల ఆర్ధిక భారం అదనం అవుతోంది. కేంద్రం తక్షణమే స్పందించి ఆర్ధిక సాయం చేస్తే.. కొంత వరకు రిలీఫ్ లభిస్తుంది. ఈ విషయంపైనా ప్రధానితో జగన్ చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 
Read More : జనసేనకు షాక్ : ఆకుల సత్యనారాయణ గుడ్ బై