నోట్ల కట్టలకు రెక్కలు : జోరుగా కోడి పందేలు

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 06:12 AM IST
నోట్ల కట్టలకు రెక్కలు : జోరుగా కోడి పందేలు

నోట్ల కట్టలకు రెక్కలొచ్చేశాయి. వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడి కత్తి కట్టి బరిలోకి దిగింది. తొడ కొట్టి సమరానికి సై అంటోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోదావరి జిల్లాలో రెండో రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా కోడి పందేలే కనిపిస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేదు. రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో పందేలు నిర్వహిస్తున్నారు.

సంక్రాంతి వేళ బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోయారు. కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరుగుతున్నాయి. భోగి రోజున ఏకంగా వందల కోట్లు రూపాయలకు పైగా డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది. కత్తి కట్టకుండా ఆడుకోమని కోర్టులు ఆదేశించినా, కత్తులు కట్టే ఆడుతున్నారు. ఉదయం నుంచే బరుల్లో కోళ్లు కత్తులు దూస్తున్నాయి.

కోడి పందేలకు తోడు పేకాట, గుండాట, మద్యం, మాంసం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కోనసీమలోని ఐ పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, అల్లవరం, ఉప్పలగుప్తం, సఖినేటిపల్లి, రాజోలు, మల్కిపురం, అంబాజీపేట మండలాల్లో కోడిపందేలకు అడ్డే లేదు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతలు ముందుండి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. కోడి పందేలను చూసేందుకు ఏపీలోని ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి.

* ఏపీలో జోరుగా కోడిపందేలు
* ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా బరులు
* చేతులు మారుతున్న వందల కోట్ల రూపాయలు
* బరుల వద్ద మంచాలు, సోఫాలు, పేకాట, మందు, మంచింగ్
* ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో అర్ధరాత్రీ పందేల నిర్వహణ