ఖమ్మం, మానుకోటలో ఎరుపు మెరిసేనా : పట్టుకోసం కమ్యూనిస్టుల దృష్టి

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట, ఖమ్మం జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది.

  • Published By: madhu ,Published On : April 6, 2019 / 01:12 PM IST
ఖమ్మం, మానుకోటలో ఎరుపు మెరిసేనా : పట్టుకోసం కమ్యూనిస్టుల దృష్టి

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట, ఖమ్మం జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట, ఖమ్మం జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మళ్లీ పట్టు సాధించేందుకు ఎర్రజెండా పార్టీలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మం నుంచి సీపీఎం, మహబూబాబాద్ నుంచి సీపీఐ కలిసి చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు కలిసి ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నారు. దశాబ్ధకాలం తరువాత లెఫ్ట్ పార్టీలు స్నేహగీతం అలపిస్తుండటంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీల కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిసిస్తోంది.
Read Also : వరంగల్ ఎవరికి వరం : కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? కారు దూసుకుపోతుందా?

ఉద్యమాల కోటగుమ్మం ఖమ్మం… ఎర్రజెండాల పార్టీలకు నిలయంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లాకు గుర్తింపు ఉంది. అయితే.. పొత్తు రాజకీయాలతో వామపక్షాలు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కమ్యూనిస్టులదే పైచేయిగా ఉండేది. ఈ రెండు పార్టీలు ఎటువైపు ఉంటే.. అటు విజయాలు వచ్చిన పరిస్థితి ఉంది. 1985నుంచి 1999 వరకు టీడీపీతో కలిసి వామపక్షాలు ప్రయాణించి లాభపడ్డాయి. 1996లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో సీపీఎం నుంచి పోటీ చేసిన తమ్మినేని వీరభద్రం విజయం సాధించారు. 

1999లో టీడీపీ మిత్రబంధం తెగిపోవడంతో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేశాయి. కానీ.. ఖమ్మం, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓడిపోయాయి. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్‌తో జత కట్టిన వామపక్షాలు… అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో లాభపడ్డాయి. ఖమ్మంలో కాంగ్రెస్, భద్రాచలంలో సీపీఎం విజయం సాధించాయి. 2009లో కమ్యూనిస్టు పార్టీ మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకుంది. మహబూబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఐ ఓటమిపాలైంది. 2014 ఎన్నికల నాటికి రెండు పార్టీలు విడిపోయాయి. వైసీపీతో సీపీఎం జతకడితే… కాంగ్రెస్ సీపీఐ దోస్తీ చేసింది. సీపీఎం సహకారంతో వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. కానీ… సీపీఐ మాత్రం బాగా దెబ్బతిన్నది. 

ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివిద సంఘాలతో కలిసి బీఎల్ఎఫ్ కూటమిగా సీపీఎం పోటీ చేసినా ఘోర పరజాయాన్ని మూటగట్టుకుంది. సీపీఐ వైరాలో పోటీ చేసినా.. ఫలితం లేకపోయింది. ఎప్పుడూ గెలిచే భద్రాచలంలో కూడా సీపీఎం ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉభయకమ్యూనిస్టులు జతకట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్‌లో సీపీఐ అభ్యర్ధిగా కల్లూరి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా.. ఆయన గెలుపు కోసం సీపీఎం ప్రచారం చేస్తోంది. ఖమ్మంలో సీపీఎం అభ్యర్ధిగా బోడా వెంకట్ విజయం కోసం సీపీఐ ప్రచారం సాగిస్తోంది. మరి వామపక్షాల ఫ్రెండ్‌షిప్ ఎన్నాళ్లుంటుంది. ఖమ్మం, మానుకోటలో పట్టుసాధిస్తారా.. లేక పాత ఫలితాలే పునరావృతమవుతాయా చూడాలి. 
Read Also : మోడీ పచ్చి అబద్దాలకోరు: కేంద్రంలో చక్రం తిప్పేది మేమే