ముగిసిన దేవీ శరన్నవరాత్రులు.. కన్నుల పండుగగా తెప్పోత్సవం

  • Published By: veegamteam ,Published On : October 9, 2019 / 02:43 AM IST
ముగిసిన దేవీ శరన్నవరాత్రులు.. కన్నుల పండుగగా తెప్పోత్సవం

ఇంద్రకీలాద్రిపై  దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల పాటు వివిధ ఆకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవారిని కనులారా చూసి భక్తులు తరించారు. చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో దుర్గమ్మ కటాక్షం పొందేందుకు భారీగా తరలివచ్చారు. వేలమంది రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. సాధారణ భక్తులతో పాటు భవానీ దీక్షలు చేపట్టిన వారు కూడా పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. చివరి రోజున దుర్గా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతు ఉత్సవాలు ముగిశాయి. పూర్ణాహుతిలో ఈవో సురేశ్‌బాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
 
తెప్పోత్సవం సందర్భంగా… స్పెషల్ లైటింగ్ డెకరేషన్, రకరకాల రంగుల లైట్లు, పుష్పమాలతో తెప్పను అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారికి అసౌకర్యం కలగకుండా.. పున్నమిఘాట్, ప్రకాశం బ్యారేజ్‌, సీతానగరం ప్రాంతాల నుంచి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
 
అంతకుముందు ఇంద్రకీల్రాది నుంచి దుర్గాఘాట్‌ వరకు దుర్గా మల్లేశ్వర స్వామివార్ల విగ్రహాలు తరలి వచ్చాయి. జిల్లా పోలీసులు కృష్ణా నది ఒడ్డుకు విగ్రహాలను తీసుకొచ్చారు. అత్యంత వైభవంగా సాగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.