Orange Alert Temperature : నిప్పుల కుంపటిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

గత ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి రికార్డుస్థాయి టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు.

Orange Alert Temperature : నిప్పుల కుంపటిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Orange Alert ( Image Credit : Google )

Orange Alert Temperatures : మాడు పగిలిపోతుంది. పది నిమిషాలు బయటికి వెళ్తేచాలు బాడీ హీటెక్కిపోతుంది. ఓవైపు భానుడి భగభగ..మరోవైపు విపరీతమైన వేడిగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజరోజుకు ఎండలు పెరిగి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో నాలుగురోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 42 డిగ్రీలు రికార్డు అవుతేనే వామ్మో ఎండలు అనుకుంటే.. ఇప్పుడు 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జగిత్యాల జిల్లా జైనాలో 46.2, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సారి ఇవే హైటెంపరేచర్స్. గత ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి రికార్డుస్థాయి టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు.

46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు : 
జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 46.1, కరీంనగర్‌ కొత్తగట్టు  46, జగిత్యాల జిల్లా కోల్వాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా ధూల్‌మిట్టలో 45.9 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూరులో  45.9, తెల్దేవరపల్లెలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 2న కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో వడగాలులు వీస్తాయని..  ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.

మే 3న నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. 4న ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని..ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో మునుపెన్నడూ లేనంతగా.. 103 ఏండ్లలో ఎన్నడూలేని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణశాఖ లెక్కల ప్రకారం 1921 తర్వాత 2024కు ముందు ఏ ఒక్క సంవత్సరంలో కూడా 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాష్ట్రంలో పలుచోట్ల 44 డిగ్రీలు దాటాయి టెంపరేచర్స్. రానున్న ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కనుందని IMD హెచ్చరించింది.

మే నెలలో గతంలో కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంటున్నారు వాతావరణశాఖ అధికారులు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ర్టాలకు IMD రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. రానున్న రెండు, మూడురోజుల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. తెలంగాణ, కర్నాటక, సిక్కిం రాష్ర్టాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు.

ఎండల తీవ్రతతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రధాన రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. పగటి పూట జన సంచారం తగ్గింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటున్నారు అధికారులు. మధ్యాహ్నం 12 నుంచి మూడు గంటల మధ్య అయితే బయటికి రాకపోవడమే బెటర్ అంటున్నారు. పగటిపూట బయటకు రావాల్సి వస్తే.. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read Also : Hot Summer : వామ్మో ఇవేం ఎండలు..! నిప్పుల కుంపటిలా తెలంగాణ, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు