జగన్ వస్తే ఘోరం జరుగుతుందని : టీడీపీకే ఓటు వేశారు

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 09:48 AM IST
జగన్ వస్తే ఘోరం జరుగుతుందని : టీడీపీకే ఓటు వేశారు

విజయవాడ : వైసీపీ చీఫ్ జగన్.. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రమే తన ఓటమిని అంగీకరించారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. తాను ఎప్పుడు సీఎం అవుతానన్న విషయాన్ని దేవుడే నిర్ణయిస్తాడని చెప్పడం ద్వారా జగన్ తన ఓటమిని అంగీకరించినట్లు అయిందన్నారు. 11వ తేదీన మధ్యాహ్నం తర్వాత ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యాన్ని తాను చూశానని ఉమ చెప్పారు. వైసీపీ వస్తే ఘోరం జరుగుతుందన్న ఆందోళన ఓటర్లలో కనిపించిందని, వారంతా టీడీపీకి మద్దతుగా నిలిచారని, అందువల్లే పోలింగ్ శాతం పెరిగిందని వివరించారు. ఎన్నికల్లో టీడీపీ స్వీప్ చెయ్యడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీకే ఓటు వేశామని చెబుతున్నారని, తెలుగుదేశం పార్టీకి 150 సీట్లు ఖాయమని ఉమ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని గవర్నర్ కు జగన్ అబద్ధాలు చెప్పారని దేవినేని ఉమ మండిపడ్డారు. బీజేపీ సహకారంతో రాష్ట్రంపై కుట్రలు చేయాలంటే కుదరదని తేల్చి చెప్పారు. వీవీప్యాట్ స్లిప్ 7 సెకన్లు కనిపించాల్సి ఉండగా, 3 సెకన్లలోనే మాయం కావడం వెనుక ఈసీ హస్తముందని దేవినేని ఆరోపించారు. కోడెలపై దాడికి దిగిన వైసీపీ వర్గీయులు, ఇప్పుడు ఆయనే తన చొక్కాను చించుకున్నారని అంటున్నారని మండిపడ్డారు. చొక్కాలు చించుకునే నైజం, అలాంటి క్రిమినల్ బుద్ధి వైసీపీ నేతలదే తప్ప టీడీపీది కాదన్నారు.