సమ్మక్క-సారక్క : వన దేవతల సేవలో భక్తులు

  • Published By: veegamteam ,Published On : March 18, 2019 / 04:36 AM IST
సమ్మక్క-సారక్క : వన దేవతల సేవలో భక్తులు

ములుగు: వన దేవతలుగా పూజలందుకుంటున్న గిరిజన దేవతలు  సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో కొలువైన దేవతలను కొలుచుకునేందుకు  మార్చి 17వ తేదీ ఆదివారం సెలవు రోజు కావటంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ర్టాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చారు.
 

దేవతల సన్నిథికి చేరుకున్న భక్తులు మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం వాగు ఒడ్డున గల జంపన్న, నాగులమ్మల గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లుల గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తల్లుల మొక్కులకు అనుగుణంగా యాటపోతులు, కోళ్లు సమర్పించి గద్దెల పరిసరాలతో పాటు చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చెట్ల కింద విడిది చేసి వంటలు చేసుకొని కుటుంబ సమేతంగా విందు భోజనాలు చేశారు.