ఏపీ ఓటర్ల లిస్టు మార్చి 25 విడుదల

  • Published By: chvmurthy ,Published On : March 24, 2019 / 02:59 AM IST
ఏపీ ఓటర్ల లిస్టు మార్చి 25 విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయనే ప్రచారాన్ని తలకిందులు చేస్తూ.. ఓటర్ల జాబితాను ప్రకటించింది.  2014సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీలో ఇప్పటి వరకు కొత్తగా 40లక్షలకు పైగా ఓటర్లు చేరారని స్పష్టం చేసింది. తుది జాబితాను ఈనెల 25న ప్రకటించనుంది. 

సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఏపీలో అధికారులు ఓటర్ల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. మార్చి 25 నాటికి అనుబంధ తుది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉండటంతో ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 11నాటికి ఏపీలో 3కోట్ల 69లక్షల 33వేల 91మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా మరో 25లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆ సంఖ్య 3కోట్ల 91లక్షల 81వేల 399మందికి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో పురుష ఓటర్లు.. కోటి,93లక్షల 82వేల 068 మంది ఉండగా.. మహిళా ఓటర్లు కోటి,97లక్షల 95వేల 423మంది, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 3908మంది  ఉన్నారు. 

2014-19 మధ్య పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయారనే ప్రచారానికి.. ముసాయిదా జాబితాలోని అంకెలు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు నమోదయ్యారు. ఐదేళ్లలో 39లక్షల 86వేల 139మంది కొత్త ఓటర్లు  నమోదయ్యారు. అదే సమయంలో ఓట్లను తొలగించాలంటూ దాదాపు 9లక్షల 40వేల దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. వీటన్నింటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత లక్షా 41వేల 822 ఓట్లను మాత్రమే తొలిగించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్త్తే..  
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42లక్షల 04వేల 35 మంది ఓటర్లుండగా..
విజయనగరంలో అత్యల్పంగా 18లక్షల 17వేల 635 మంది ఓటర్లున్నారు.  
శ్రీకాకుళం జిల్లాలో 21లక్షల 70వేల 802,
విశాఖపట్నం- 35లక్షల 74వేల 246,
తూర్పుగోదావరి – 42లక్షల 4వేల 35,
పశ్చిమ గోదావరి -32లక్షల 6వేల 496,
కృష్ణా-35లక్షల 7వేల,460,
గుంటూరు-39లక్షల 62వేల 143,
ప్రకాశం-26లక్షల 28వేల 449,
నెల్లూరు-23 లక్షల 82వేల 114,
కడప-21 లక్షల 92వేల 158,
కర్నూలు-31లక్షల 42వేల 322,
అనంతపురం-32లక్షల 14వేల 438,
చిత్తూరులో 31లక్షల 79వేల 101మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదాలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

2014సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 3కోట్ల 51లక్షల 95వేల 260మంది ఓటర్లుంటే 2019లో ఓటర్ల సంఖ్య 3కోట్ల 91లక్షల 81వేల 399కు చేరింది.  జనవరి 11న దేశవ్యాప్తంగా తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత ఏపీలో కొత్తగా 22లక్షల 48వేల 308మంది ఓటర్లుగా నమోదు అయ్యారు. ఐదేళ్లలో ఓటర్ల జాబితాలో కొత్తగా 39లక్షల 86వేల 139మంది ఓటర్లు చేరారు.