అధికారం దుర్వినియోగం : ఆ ముగ్గురు ఐపీఎస్‌లపై ఆరోపణలు ఇవే

ఈసీ కొరడా ఝళిపించింది. ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై యాక్షన్ తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల

  • Published By: veegamteam ,Published On : March 27, 2019 / 02:24 AM IST
అధికారం దుర్వినియోగం : ఆ ముగ్గురు ఐపీఎస్‌లపై ఆరోపణలు ఇవే

ఈసీ కొరడా ఝళిపించింది. ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై యాక్షన్ తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల

ఈసీ కొరడా ఝళిపించింది. ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్‌లపై యాక్షన్ తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి ఆ ముగ్గురిని తప్పించింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసింది. ఎన్నికల పోలింగ్ కి సరిగ్గా రెండు వారాల ముందు ఈసీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ముగ్గురు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకున్నారు. వారిపై ఉన్న ఆరోపణలు ఏంటి..

టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుపై వైసీపీ వ‌రుస ఫిర్యాదులు చేసింది. నిఘా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. ప్రధానంగా వైసీపీ నేత‌ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆధారాల‌తో సహా ఈసీకి ఆ పార్టీ నాయకులు కంప్లయింట్ చేశారు. నంద్యాల ఎన్నిక‌ల స‌మ‌యం నుండి ప్ర‌స్తుత ఎన్నిక‌ల వ‌ర‌కు నిఘా సిబ్బందిని ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు పూర్తిగా అధికార పార్టీ కోసం వినియోగించార‌నేది ఆరోప‌ణ‌. పోలీసు సిబ్బంది ద్వారా గ్రామాల‌కు నగదు త‌ర‌లిస్తున్నార‌ని కంప్లయింట్ చేశారు.

ఎన్నికల వేళ.. ప్రభుత్వానికి నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల బ‌లాబ‌లాలు.. అధికార పార్టీ తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై నిఘా బాస్ స‌మాచారం ఇస్తున్నార‌ని.. కింది స్థాయి సిబ్బందిని ప్ర‌భావితం చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు కంప్లయింట్ చేశారు. దీనిపై విచార‌ణ చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచలన నిర్ణ‌యం తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ పై బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది.

సీఎం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌బెంచ్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పరికరాలను దుర్వినియోగం చేయడం వంటి అభియోగాలు ఉన్నాయి. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మలపైనా చర్యలు తీసుకుంది. వేటు పడిన ఈ ముగ్గురు అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది.

శ్రీకాకుళం ఎస్పీ వెంక‌ట‌ర‌త్నం… జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు సంబంధించిన న‌గ‌దు దొరికినా వ‌దిలేశార‌నేది వైసీపీ ఆరోపణ. కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళి వాహనంలో తీసుకెళ్తున్న రూ.5 కోట్లను తనిఖీల సందర్భంగా అధికారులు పట్టుకున్నారని.. ఇంటెలిజెన్స్‌ డీజీ ఆదేశాలతో ఆ డబ్బును వదిలేశారనే ఫిర్యాదుతో ఎస్పీ వెంకటరత్నంపై ఈసీ వేటు వేసినట్లు సమాచారం. నాన్‌కేడర్‌ ఎస్పీగా పదోన్నతి పొందిన వెంకటరత్నంను ఇటీవలే శ్రీకాకుళం ఎస్పీగా నియమించారు.

కడ‌ప జిల్లాలో వైఎస్ వివేకా హ‌త్య తర్వాత ప‌రిణామాలపై ఎన్నిక‌ల సంఘానికి వైసీపీ ఫిర్యాదులు చేసింది. వివేకా కుమార్తె సైతం ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్రయించారు. దర్యాఫ్తు సక్రమంగా జరగడం లేదన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ విఫలం అయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం జోలికి వెళ్లకుండా దర్యాప్తును తప్పుదోవ పట్టించారన్నది వైసీపీ నేతల అలిగేషన్. ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ జోక్యం కారణంగా వైసీపీపైన, వైఎస్‌ కుటుంబ సభ్యులపైన నెపం నెట్టే ప్రయత్నాలు జరిగాయంటున్నారు. క‌డ‌ప జిల్లాలో ఆధిప‌త్యం కోసం పోలీసుల సాయంతో టీడీపీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోందని వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు ఎస్పీలపై ఈసీ యాక్షన్ తీసుకుంది.

ఏపీలో పోలింగ్ కు సమయం దగ్గర పడింది. ఈ సమయంలో ముగ్గురు ఐపీఎస్‌లపై ఈసీ చర్యలు తీసుకోవడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ప్ర‌భుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఎవ‌రిని నియమించనుంది? కడప, శ్రీకాకుళం జిల్లాల‌కు కొత్త ఎస్పీలుగా ఎవ‌రిని అపాయింట్ చేయనుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.