అయ్యో : యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 06:04 AM IST
అయ్యో : యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య (65) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఎల్లయ్యను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎల్లయ్య మృతి చెందాడు. మృతుడు ఎల్లయ్య దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి వాసి. రెండు రోజులుగా ఎల్లయ్య క్యూలోనే నిలబడ్డాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టానికి అద్దం పట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని ప్రాణాలు పోకముందే అధికారులు సమస్యని పరిష్కరించాలన్నారు.

కాగా, యూరియా కొరత ఆందోళనకరంగా మారుతోంది. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల దుకాణాల దగ్గర బారులు తీరుతున్నారు. రోజుల తరబడి క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. యూరియా నిల్వలు లేక.. అందరికీ అందడం లేదు. దీంతో ఎరువుల దుకుణాల దగ్గర వాగ్వాదాలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో యూరియా కొరత లేదని అంటున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అందరికి యూరియా అందేలా చూస్తామన్నారు. నౌకల ద్వారా యూరియా రావడంలో ఆలస్యమైందని, అందుకే కొంత అసౌకర్యం కలిగిందని వివరించారు. సెప్టెంబర్ 10 వరకు నిల్వలన్నీ నిర్దేశిత ప్రాంతాలకు చేరేలా చూడాలని కంపెనీలను ఆదేశించామని అధికారులు తెలిపారు.

యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. యూరియా కొరతకు కేసీఆర్ ప్రభుత్వమే కారణం అంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, రైతులు జీవితాలతో చెలగాటం ఆడిందని ఆరోపించాయి. అధికార పక్షం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం అని అధికార పార్టీ నేతలు ఎదురు దాడికి దిగారు. యూరియా కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. యూరియాను తెప్పించాల్సిన కనీస బాధ్యత బీజేపీ నేతలకు లేదని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చుని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు బీజేపీ పప్పులు ఉడకవని అన్నారు. పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయాల్లో హుందాతనం, విజ్ఞత అవసరమని ఎమ్మెల్సీ గుత్తా హితవు పలికారు.