10Tv Conclave : దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది- తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు
కేంద్రం నుంచి వనరులను రాబట్టుకోవాల్సిన అవసరం రాష్ట్రాలకు ఉంది.

Telakapalli Ravi On Election Mood
10Tv Conclave : విజయవాడ హోటల్ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడారు. పలు అంశాలపై ఆయన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎలక్షన్ మూడ్ పై ఆయన స్పందించారు.
”దేశం సంక్షిష్ట పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రం కూడా అప్పుల్లో ఉంది. దేశం కోటిన్నర కోట్ల అప్పుల్లో ఉంది. అలా దేశమే అప్పుల్లో ఉన్నప్పుడు రేపు వేరే ప్రభుత్వం వచ్చినా అప్పులు లేకుండా బతికే పరిస్థితి ఉండదు. అభివృద్ధి నమూనా ఏది తీసుకుంటారు? దేశం ముందే ఇది పెద్ద ప్రశ్న. ఒక సమగ్రమైన ప్రణాళికతో ప్రజల విశ్వాసం పొందే ప్రయత్నాన్ని రాజకీయ పార్టీలు చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి వనరులను రాబట్టుకోవాల్సిన అవసరం రాష్ట్రాలకు ఉంది. ఎన్టీఆర్ నుంచి బాబు వరకు గతంలో జాతీయ రాజకీయాల్లో కొంత పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు మనది సహాయక పాత్రే” అని తెలకపల్లి రవి అన్నారు.
”సంక్షేమ పథకాల గురించి చెప్పినప్పటికీ.. రాజధాని అనేది ప్రతిష్టంభనలో పడిపోవడం, కేసులు, అరెస్టులు, దాడులు.. ఇలాంటివి వైసీపీ ప్రభుత్వంపై విమర్శ తెచ్చి పెట్టాయి. దాన్ని వాళ్లు రేపు సరిదిద్దుకుంటారా? ఆ మేరకు మేము అలాంటి అవకాశం లేకుండా చేస్తాం అనే హామీ ఇస్తారా? అన్నది వైసీపీ ముందున్న అతిపెద్ద సవాల్. మన దేశంలో ఉపాధి (ఆర్థికంగా బతకటం) జరగాలని కోరుకుంటాం. దేశమే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అప్పుల్లో ఉంది.
రేపు కొత్త ప్రభుత్వం వచ్చినా ఈ అప్పులు లేకుండా బతికే పరిస్థితి ఉండదు. కానీ, అప్పులు ఎలా తేవాలి? ఎలా ఉపయోగించాలి? ప్రజలకు ఉపాధి, బతికే అవకాశం, ఆర్థిక కార్యకలాపాలు ఎలా చక్కదిద్దుతారు? అనేది రెండు ప్రభుత్వాలకు ఒక సవాల్ గా ఉంది. అభివృద్ధి నమూనా ఏది తీసుకుంటారు? ఇది దేశం ముందే ఒక పెద్ద ప్రశ్న. వ్యవసాయ ప్రధానమైన ఏపీలో కనీస పారిశ్రామికీకరణ ఎలా జరగాలి? ఆర్థిక పునర్ జీవనం ఎలా రావాలి? అన్నదానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తోడవుతాయి కానీ, అవే రాష్ట్రాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండదు” అని తెలకపల్లి రవి అన్నారు.
Also Read : సీఎం జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఎందుకు? సజ్జల కీలక వ్యాఖ్యలు