సీటు – హీటు : గాంధీ భవన్‌లో టెన్షన్

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 02:30 PM IST
సీటు – హీటు : గాంధీ భవన్‌లో టెన్షన్

ఎంపీ టికెట్ల కేటాయింపు తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసింది. పెద్దపల్లి సీటును స్థానికేతరుడికి ఎలా కేటాయిస్తారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నిరాహార దీక్షకు దిగడంతో.. గాంధీ భవన్‌లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఉట్ల ప్రసాద్ భావించారు. టికెట్‌ను మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్‌కు కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం.

ఆగ్రహానికి గురైన ప్రసాద్ మార్చి 18వ తేదీ సోమవారం తన అనుచరులతో కలిసి గాంధీ భవన్‌కు చేరుకున్నారు. చంద్రశేఖర్‌కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీని దెబ్బతీసిన చంద్రశేఖర్‌‌కు.. పెద్దపల్లి టికెట్‌ను ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్.. టీఆర్ఎస్‌లో చేరిపోయారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.