నష్టాల్లో ఆర్‌టీసీ.. కష్టాల్లో ఉద్యోగులు.. ప్రభుత్వం గట్టేక్కిస్తుందా?

10TV Telugu News

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో సాగుతోంది. కరోనా కారణంగా ఆర్టీసీ ఎప్పుడూ లేనంత నష్టాల్లోకి వెళ్లిపోయింది. నష్టాల ఊబిలోంచి తెలంగాణ ఆర్టీసీ బయటపడుతుందా..? అప్పుల భారం నుంచి ఆర్టీసీని ప్రభుత్వం గట్టెక్కిస్తుందా..? సంస్థను గాడిలో పెట్టేందుకు కేసీఆర్‌ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలేంటి? ఛార్జీల పెంపే ఆర్టీసీని నష్టాల్లోంచి గట్టెక్కించే మార్గమా..?

ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి గట్టెక్కుతున్న తెలంగాణ ఆర్టీసీని కరోనా కోలుకోలేని దెబ్బతీయగా.. లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకు బస్సులు వచ్చే పరిస్థితి. కొద్ది నెలలుగా ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ కూడా సగానికి పైగా పెరగగా.. కార్గో పార్సెల్ సర్వీస్‌ సంస్థకు కొంత ఆదాయం తెచ్చిపెడుతోంది. కరోనా కంటే ముందు నుంచి పేరుకుపోయిన బకాయిల భారం మాత్రం కరోనాతో మరింత రెట్టింపు అయింది. సాధారణంగా రోజుకు 13 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా.. ప్రస్తుతం 9 కోట్లు మాత్రమే వస్తోంది. అంటే నెలకు 3 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పోలిస్తే.. 150 నుంచి 200 కోట్ల ఆదాయం తగ్గింది.

గతంలో వచ్చే ఆదాయంతో చూస్తే.. ఆర్టీసీ ఇంకా నష్టాల్లోనే కొనసాగుతోంది. ఆక్యుపెన్సీ రేట్‌ పెరుగుతున్నా.. పూర్తి స్థాయిలో నష్టాల నుంచి గట్టేకాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికే అప్పులకు వడ్డీలు, ఉద్యోగుల జీతాలను చెల్లించేందుకు ప్రభుత్వంపై ఆధారపడుతోంది ఆర్టీసీ. బ్యాంక్ గ్యారంటీతో సిబ్బంది జీతాలు ఇతర ఖర్చులను చెల్లించుకుంటూ వస్తోంది. డీజిల్ రేట్లు పెరుగుతుండడం.. లాక్‌డౌన్ మిగిల్చిన నష్టాలు, పాత అప్పులు ఆర్టీసీకి గుదిబండగానే ఉన్నాయి.

కరోనా కష్టాలు, పాత అప్పుల నుంచి తెలంగాణ ఆర్టీసీ కొంతైనా బయటపడాలంటే.. ప్రభుత్వం చేసే సహాయంతో పాటు మరోసారి చార్జీలు పెంచితేనే.. కొంతైనా ఆర్థిక ఉప శమనం లభిస్తుందంటున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. అందులో భాగంగానే ఆర్టీసీ రివ్యూలో చార్జీల పెంపు అంశాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రభుత్వం చేదోడువాదోడుగా ఉన్నా.. ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి.. చార్జీల పెంచితేనే మంచిదని భావిస్తున్నాయి ఆర్టీసీ వర్గాలు.

మరోవైపు ఛార్జీల పెంపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బస్సులు ఎక్కే సాధారణ ప్రయాణికులూ భారీగా తగ్గిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ తీసుకునే నిర్ణయం సరైనదేనా అనే ప్రశ్న పుట్టుకొస్తోంది. గతంలో పెంచినట్లే చార్జీలు పెంచుతారా..? లేక ప్రస్తుతం ఉన్న చార్జీల ధరను రౌండ్ ఫిగర్ చేస్తారా? అనేది ప్రశ్న

మరోవైపు ఇప్పటికే అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థికంగా ఆర్టీసీ ఉద్యోగులు గట్టెక్కేలా ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం ఈ క్రమంలో ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేసి, ఉద్యోగులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఏం చెయ్యబోతోంది అనేది చూడాలి మరి.

10TV Telugu News