రెండు నెలల పెన్షన్ ఒకేసారి: జగన్ కీలక నిర్ణయం

  • Published By: vamsi ,Published On : February 11, 2020 / 01:07 PM IST
రెండు నెలల పెన్షన్ ఒకేసారి: జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు.. రేషన్ కార్డులు.. ఎగిరిపోయాయంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భారీ మొత్తంలో పెన్షన్లు పోయినట్లు చెబుతున్నారని, నిజంగానే అర్హులెవరికైనా ఈ నెల పెన్షన్ అందకుంటే వారి దృవీకరణ పత్రాలను పరిశీలించి, వారికి తప్పుగా పెన్షన్ తీసేసిన యెడల రెండు నెలల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు.

స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్‌.. వివిధ పథకాలు అందడం లేదంటూ ప్రజల నుంచి వచ్చిన వినతుల గురించి వారికి వివరించారు. సాంకేతిక కారణాల వల్లే కొందరికి పథకాలు అందట్లేదని ఈ సంధర్భంగా సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రైతు భరోసా కింద ఇంకా 21వేల 750 కేసులు పెండింగ్ ఉన్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. వాటిని వెంటనే పరిష్కరించి డబ్బు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామని, అయినా పెన్షన్లు తీసేసినట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు జగన్. మళ్లీ వెరిఫికేషన్‌ చేసి ఎవరికైనా అర్హత ఉందని తేలితే.. ఒకేసారి రెండు నెలల పెన్షన్‌ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రేషన్ కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్‌ పూర్తిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.. ఈ నెల 17వ తేదీ నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని, 18వ తేదీ కల్లా అప్‌లోడ్‌ చేసి, 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు.

ఫిబ్రవరి 20వ తేదీ నాటికి ఫైనల్ లిస్ట్ ప్రకటించి మార్చి ఒకటో తేదీన కార్డుతో పాటు, పెన్షన్‌ ఇవ్వాలని అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఫిబ్రవరి 15 నుంచి పంపిణీ చేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. అలాగే అమ్మ ఒడి పథకం కింద 42,33,098 మందికి డబ్బు అందజేసినట్లు చెప్పారు. ఇంకా 11,445 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్తున్నట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. 

గ్రామ వలంటీర్‌ ద్వారా లబ్ధిదారులను గుర్తించి.. ఇళ్ల పట్టా పొందడానికి అర్హుడు అని అనిపిస్తే వెంటనే ఇళ్లపట్టా ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్లపట్టాలకు అవసరమైన భూమిని మార్చి 1 కల్లా సిద్ధంచేయాలన్నారు.