లోక కళ్యాణం : కేసీఆర్ చండీయాగం మూడో రోజు

  • Published By: madhu ,Published On : January 23, 2019 / 08:46 AM IST
లోక కళ్యాణం : కేసీఆర్ చండీయాగం మూడో రోజు

సిద్ధిపేట : ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం మూడో రోజుకు చేరుకుంది. జనవరి 23వ తేదీ బుధవారం ధవళ వస్త్రాలు ధరించిన రుత్వికులు యజ్ఞ క్రతువులో పాల్గొంటున్నారు. కె.సి.ఆర్. దంపతులతో పాటు ప్రముఖులు యాగశాలకు రానుండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లోక కళ్యాణం కోసం తలపెట్టిన ఈ యాగంలో మూడోరోజు కూడా రుత్వికులు గణపతిపూజ, దేవతాహ్వానం, అష్టదిక్పాలుకుల పూజలతోనే యజ్ఞాన్ని ప్రారంభించారు. మూడు వందల చండీ పారాయణాలు చేస్తారు. చతుర్వేద పారాయణాలు, హవనాలు ఉంటాయని రుత్వికులు చెపుతున్నారు. 
మాడుగుల మాణిక్య సొమయాజుల పర్యవేక్షణలో వేద పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మ, చంద్రశేఖరశర్మలు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక యాగశాలలలో రుత్వికులకు భొజనాలు, హాజరయ్యే వి.వి.ఐ.పి లకు ఇతర సిబ్బందికి ఏర్పాట్లను అష్టకాల రామ్మోహన్ శర్మ  సమన్వయం చేస్తున్నారు. మొత్తంగా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం వేద మంత్ర పారాయణాలతో ధ్వనిస్తోంది. మరో రెండు రోజులపాటు ఈ యాగం కొనసాగనుంది.