ముహూర్తం కుదిరింది : కొణతాల రీ ఎంట్రీ

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 04:09 AM IST
ముహూర్తం కుదిరింది : కొణతాల రీ ఎంట్రీ

విశాఖ : కోణతాల రామకృష్ణ రీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి తర్వాత తెలుగుదేశంలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయిరాష్ట్ర రాజకీయాలు తెలిసిన వారికి కోణతాల రామకృష్ణ పరిచయం అవసరం లేని పేరు. కాంగ్రెస్ వాదిగా రాజశేఖర్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా ఉన్న కొణతాల వైఎస్‌ మరణం వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగటమే కాకుండా మంత్రిగా కూడా పని చేశారు. అలా విశాఖ జిల్లాలో కొణతాల హవా దశాబ్ధం పాటు నడిచింది. వైఎస్‌ మరణం తర్వాత కొణతాల వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తన అనుచరులైన గండి బాడ్జికి పెందుర్తి టిక్కెట్‌, కిడారి సర్వేశ్వరరావుకు అరకు టిక్కెట్‌ను ఇప్పించుకోగలిగారు. తర్వాత జగన్‌తో విభేదాల కారణంగా వైసీపీని వీడారు. తర్వాత ఆయన ఏ పార్టీలోకి వెళ్లలేదు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర సమస్యలపై ప్రజాసంఘాలతో కలిసి పోరాటం చేస్తూ వచ్చారు. విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సుజళ స్రవంతి పనులు ప్రారంభించాలని, విమ్స్‌ను ప్రైవేట్ పరం చెయ్యొద్దంటూ ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశారు. ఐతే.. అటు.. వైసీపీ, ఇటు టీడీపీ నేతలతో కొణతాల టచ్‌లోనే ఉన్నారు.

కొణతాలకు జిల్లా వ్యాప్తంగా సొంత బలం ఉండటం.. రాజకీయ వ్యూహాలు బాగా చేస్తారన్న పేరుంది. దీంతో దాడి వీరభద్రరావు అనకాపల్లిలో లేని లోటును పూడ్చాలని తెలుగుదేశం భావిస్తోంది. వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పుడే కొణతాల టీడీపీలో చేరుతారని వార్తలు వినిపించాయి. వాటికి బలం చేకూరేలా ఆయన అనుచరులు గండీ బాబ్జీ, కిడారి సర్వేశ్వరావు టీడీపీలో జాయినయ్యారు. దీంతో కొణతాల టీడీపీలో చేరడం నామమాత్రమే అనుకున్నారు. కాని ఆయన మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా ప్రజా సమస్యలపై పనిచేస్తూ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు.

ఐతే ఎన్నికల సమీపిస్తుండడంతో కొణతాల టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటీవల అనకాపల్లిలో అనుచరులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీడీపీ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు కూడా అందాయని.. పండుగ తర్వాత ముహూర్తం చూసుకొని అనుచరులతో కలిసి దేశం తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.