మెర్సీ కిల్లింగ్ : 10tv కథనంపై స్పందించిన సీఎం జగన్

  • Published By: madhu ,Published On : October 12, 2019 / 01:49 AM IST
మెర్సీ కిల్లింగ్ : 10tv కథనంపై స్పందించిన సీఎం జగన్

కన్నబిడ్డ కారుణ్యమరణానికి ఆనుమతించాలని కోర్టు మెట్లెక్కారు ఆ తల్లిదండ్రులు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ చిన్నారి నరకయాతను చూడలేక.. చికిత్స చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తల్లడిల్లిపోతున్నారు. ఆ తల్లిదండ్రుల వ్యథను అర్థం చేసుకుంది 10tv. వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఆ చిన్నారి దీనావస్థపై స్పందించారు సీఎం జగన్‌. చిన్నారి ఆరోగ్యం గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సుహానా చికిత్సకు అవసరమయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్నారికి రోజువారీగా అవసర

మయ్యే ఇన్సులిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచే ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. సుహానా ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య స్థితిని పర్యవేక్షించాలని అధికారులను అదేశించారు సీఎం. చిత్తూరు జిల్లా, బి.కొత్తకోట, బీసీ కాలనీలో నివాసం ఉండే బావాజాన్, షబానా దంపతులకు రెక్కాడితే గానీ డొక్కాడదు. సొంతిల్లు కూడా లేని వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మొదటి, రెండో సంతానంగా ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. పుట్టిన తర్వాత రోజుల వ్యవధిలోనే షుగర్‌ స్థాయి పడిపోయి ఆ ఇద్దరూ చనిపోయారు. మూడో సంతానంగా  సుహానా జన్మించింది.

పాపకు ఏడాది వయసు వచ్చినా ఎదుగుదల లేకపోవడంతో కొంతకాలం క్రితం డాక్టర్లకు చూపించారు. చిన్నారికి షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో.. పాపను కాపాడుకోవడానికి అప్పులు చేసి వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయం కాలేదు. ఇకపై వైద్యం చేయించడానికి వారివద్ద చిల్లిగవ్వలేదు. కళ్ల ముందే నరకయాతన పడుతున్న బిడ్డను చూస్తూ బతకలేమని, తమ బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
Read More : కూచిపూడిలో కుతంత్రం : సంజీవని ఆస్పత్రి విరాళాల గోల్‌మాల్‌ కథ