తిరుపతి వాసులకు గుడ్ న్యూస్, ఆ వ్యక్తికి కరోనా లేదు

తిరుపతి వాసులకు గుడ్ న్యూస్, ఆ వ్యక్తికి కరోనా లేదు

హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్‌కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అతడికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో తిరుపతి వాసులు, డాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఫిబ్రవరి 29,2020 తైవాన్‌కు చెందిన వ్యక్తి కరోనా లక్షణాలతో రుయా ఆసుత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తైవాన్ దేశస్తుడు చెన్ షి షన్ బంగారుపాళ్యెంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మెషిన్ రిపేర్ కోసం చిత్తూరు జిల్లాకు వచ్చాడు.

అసలే తైవాన్ నుంచి వచ్చాడు, పైగా జలుబు, దగ్గు:
కాగా దగ్గు, గొంతు నొప్పి రావడంతో.. అంతా భయపడ్డారు. అసలే తైవాన్ నుంచి వచ్చాడు. ఆపై అనారోగ్యం బారిన పడ్డాడు. తైవాన్ వ్యక్తికి కరోనా సోకిందేమో అనే అనుమానంతో తిరుపతి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని రుయా ఐసోలేషన్ వార్డుకి తరలించారు. కరోనా సోకిందా లేదా అని తేల్చడం కోసం వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపారు. రిపోర్టులో నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఏపీలో ఒక్క కరోనా కేసు లేదు:
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొవిడ్‌ 19ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని.. విదేశాల నుంచి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామని.. 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. కొవిడ్ ప్రభావిత దేశాల నుంచి ఇప్పటి వరకు 263 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారని, వారందరినీ పరిశీలనలో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 50 మంది ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 211 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందని.. అనుమానంగా ఉన్న 11 మంది శాంపిళ్లను ల్యాబ్‌కు పంపగా 10 మందికి నెగెటివ్‌ అని తేలిందన్నారు.

70 దేశాల్లో కరోనా కల్లోలం:
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 70దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనాతో ఇప్పటికి 3వేల 50మంది మృతి చెందగా.. 89వేల 200మంది చికిత్స పొందుతున్నారు. సౌత్‌ కొరియాలో 25మంది చనిపోతే.. నిన్న ఒక్కరోజే 335కొత్త కేసులు నమోదు కాగా..బాధితుల సంఖ్య 4500కు చేరింది. ఇటలీలో 52మంది మృతి చెంది మరో 1000మంది వైరస్ లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నారు. అమెరికాలో ఆరుగురు చనిపోగా..మరో 66మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇటు ఇరాన్‌ లో మృతుల సంఖ్య 66కు చేరగా జపాన్‌ లో బాధితుల సంఖ్య 944కు పెరిగింది.

భారత్‌లో 2 కరోనా కేసులు, తెలంగాణలో తొలి కేసు:
కరోనా వ్యాప్తితో భారత్‌ అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి భారత్ లోనూ ఎంటర్ అయ్యింది. రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకటి ఢిల్లీలో మరొకటి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో. ఇటలీ నుంచి ఢిల్లీ నుంచి వ్యక్తి, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆ వ్యక్తికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసు నమోదు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు.