బండి సంజయ్‌పై జరుగుతున్న ప్రచారం అబద్ధం: పోలీసులు

  • Published By: vamsi ,Published On : January 22, 2020 / 11:08 AM IST
బండి సంజయ్‌పై జరుగుతున్న ప్రచారం అబద్ధం: పోలీసులు

బీజేపీ ఎంపీ బండి సంజయ్ మీద రాళ్ల దాడి జరిగినట్లుగా వచ్చిన వార్తలను ఖండించారు కరీంనగర్ పోలీసులు. ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నాలుగు రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ పై కిసాన్ నగర్ లో రాళ్ల దాడి జరిగిందంటూ, పలువురు కానిస్టేబుళ్లకు, బీజేపీ కార్యకర్తలకు దెబ్బలు తగిలాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

కరీంనగర్‌లో అంతా టెన్షన్ నెలకొని ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగగా.. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని వెల్లడించారు పోలీసులు. పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పోలీసుశాఖ తరపున పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టామని వివరించారు. 24 గంటలు వారిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. 

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఏ ప్రజా ప్రతినిధిపై కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రాళ్ల దాడులు జరగలేదని, అటువంటి దాడి జరిగి వుంటే, అదే రోజు పార్లమెంటు సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చే వారని, అంతేకాకుండా వారి వ్యక్తిగత రక్షణ కోసం కేటాయించిన పోలీసు సిబ్బంది వెంటనే వేగంగా స్పందించి ఉండేవారని అన్నారు. 

సోషల్ మీడియాలో కొంతమంది తెలిసీ తెలియని పరిజ్ఞానంతో ఉద్దేశ్యపూర్వకంగా పార్లమెంటు సభ్యుడి పై రాళ్ల దాడి జరిగిందంటూ వార్తలను ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రజల భద్రత కోసం ఎల్లవేళలా పనిచేస్తూ ఉన్నారని ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు, సందేశాలు స్ప్రెడ్ చెయ్యడం సరికాదని అన్నారు.

అయితే, తన మీద దాడి జరిగినా కూడా ఎలాంటి దాడి జరగలేదంటూ పోలీస్ కమిషనర్ చెప్పడంతో హర్ట్ అయిన ఎంపీ బండి సంజయ్ తనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని వెనక్కు పంపేశారు.