గ్రామ స్థాయికి చేరిన పాలనా వ్యవస్థ

గ్రామ స్థాయికి చేరిన పాలనా వ్యవస్థ

గ్రామ స్థాయికి చేరింది పాలనా వ్యవస్థ. ఏచిన్న పనికావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సిన స్థితి నుంచి ప్రతి పల్లెకు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని కొర్రాయి అనే గ్రామ ప్రజలు రెవెన్యూ వ్యవస్థతో చిన్న పని కావాలన్నా 20 కి.మీ. దూరం వెళ్లాల్సి ఉంది. పంచాయితీ కార్యదర్శి, వీఆర్వోలు నెలకోసారి పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు మాత్రమే కనిపిస్తారని గ్రామస్తులు చెబుతుంటారు. పోనీ వెళ్లడానికి ప్రయత్నిస్తే రవాణా ఖర్చులు అదనం. వీటన్నిటికీ పరిష్కారం వచ్చేసినట్లే. 

మారుమూల ప్రాంతంలో సైతం ఆదివారం నుంచి 536 రకాల సేవలు గ్రామ సచివాలయంలోనే అందజేసే ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. కొర్రాయి ఒక్క ప్రాంతానికే కాదు.. రాష్ట్రంలోని కుగ్రామాలు, తండాలతో సహా మొత్తం 15వేల 2 గ్రామ, వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను స్థానికంగానే అందించనున్నారు.

పొలం పాస్‌బుక్‌లో భూముల వివరాలు నమోదు, ఈసీల జారీ, కుల ధృవీకరణ పత్రాలు, రేషన్‌కార్డులో మార్పుచేర్పులు, దివ్యాంగులకు సదరు సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్‌ లాంటి సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి వస్తాయి. 15 నిమిషాల వ్యవధిలోనే 1 బి, అడంగల్, ఆధార్, రేషన్‌కార్డు ప్రింట్, టైటిల్‌డీడ్, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ సరిఫికెట్‌ కాపీ, విద్యుత్‌ కనెక్షన్‌ కేటగిరి మార్పు లాంటి సేవలు పొందవచ్చు. మొత్తం 47 రకాల సేవలను అందిస్తుండగా మరో 148 రకాల సేవలను కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తారు. 

మూడు రోజుల అనంతరం ఒక్కో సేవను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ సేవలన్నింటినీ అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేక పోర్టల్‌ రూపొందించారు. ముఖ్యమంత్రి డ్యాష్‌ బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో దీన్ని అనుసంధానించారు. వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఇంటి వద్దే అందచేసేందుకు ప్రభుత్వం నియమించిన 2.81 లక్షల మంది వాలంటీర్లకు మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులను ఇప్పటికే పంపిణీ చేశారు.