రాజస్థాన్ లోని ఒకే ఇంటిలో 11మంది పాకిస్థానీలు ఆత్మహత్య..!!

  • Published By: nagamani ,Published On : August 9, 2020 / 02:28 PM IST
రాజస్థాన్ లోని ఒకే ఇంటిలో 11మంది పాకిస్థానీలు ఆత్మహత్య..!!

రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏ కష్టం వచ్చిందోగానీ..ఒకే కుటుంబానికి చెందిన 11మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని దేచు పోలీసు స్టేషన్‌ పరిధిలోని లొడ్టా గ్రామంలోని పొలంలో ఉన్న చిన్న ఇంటిలో శనివారం (ఆగస్టు 8,2020) రాత్రి చోటు చేసుకుంది. ఈ ఆత్మహత్యలు మిస్టరీగా మారాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి..మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.వారంతా విషయం తీసుకుని మరణించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌కు వచ్చింది. వీరంతా హిందూ శరణార్థులు. కుటుంబంలోని 12 మంది ఒకేసారి విషం తీసుకున్నారు. వీరిలో 11 మంది చనిపోగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో పురుగుల మందు వాసన వెదజల్లుతున్నట్లు స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు దృష్టి సారించారు.

ఈ ఆత్మహత్యల ఘటనపై ఎస్పీ రాహుల్ బర్హాట్ మాట్లాడుతూ..మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవని..వారు నివసిస్తున్న గుడిసెలో క్రిమిసంహారక మందు వాసన వస్తోందనీ..వారంతా దాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోందని తెలిపారు. గుడిసె బైట మాత్రం ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడని అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించామని..అతని కోలుకుంటే అసలుజరిగిందేమిటీ? అనే విషయం తెలుస్తుందని తెలిపారు.ఆత్మహత్యకు గల కారణం ఏమిటోతెలుస్తుందన్నారు. ఈ కుటుంబమంతా పాకిస్థాన్ నుంచి వలస వచ్చివారని తెలిపారు. వారు పాకిస్థాన్ లోని భీల్ వర్గానికి చెందినవారనీ..వారంతా గ్రామంలో వ్యవసాయ పొలాన్ని అద్దెకు తీసుకుని ఆ పొలంలోనే చిన్న గుడిసె వేసుకుని జీవిస్తున్నారని తెలిపారు.