గోదావరిలో ఘోరం : బోటు ప్రమాదంపై కఠిన చర్యలు – మేకతోటి సుచరిత

  • Published By: madhu ,Published On : September 15, 2019 / 11:28 AM IST
గోదావరిలో ఘోరం : బోటు ప్రమాదంపై కఠిన చర్యలు – మేకతోటి సుచరిత

తూర్పుగోదావరిలో జరిగిన ఘోరంపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. బోటు ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని, మున్ముందు ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామన్నారు. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర పర్యాటక బోటు బోల్తా పడింది. ఈ సందర్భంగా ఏపీ హోం మంత్రితో 10tv మాట్లాడింది.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వరద ఉధృతి బాగా ఉందని..బోటు డ్రైవర్ అప్రమత్తం లేకపోవడం వల్లే ఘోరం చోటు చేసుకుందని తెలుస్తోందన్నారు. గల్లంతైన వారిని ఆచూకి కనుగొనేందుకు రెండు హెలికాప్టర్లను పంపిస్తున్నట్లు, ఇప్పటికే NDRF బృందం అక్కడకు చేరుకుందన్నారు. గోదావరి ఉధృతి బాగా ఉన్న సమయంలో..పర్యాటక బోట్లను అనుమతించడం ఘోరమైన చర్యగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

లైఫ్ జాకెట్లు ఉన్న వారంతా క్షేమంగా బయటకు వచ్చారన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. బోటులో వెళ్లే సమయంలో యాజమాన్యం కనీసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ప్రయాణీకులకు కూడా కొంత అవగాహన ఉండాలన్నారు. ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మేకతోటి సుచరిత హామీనిచ్చారు. 

సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పాపికొండలు చూసేందుకు రాయల్ వశిష్ట బోటులో కొంతమంది వెళ్లారు. కచ్చులూరు వద్ద పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో 62 మంది ప్రయాణీకులున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. 24 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. మిగతా వారి కోసం గాలింపులు చర్యలు చేపడుతున్నారు. ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఘటనా ప్రదేశానికి వెళ్లాలని అందుబాటులో ఉన్న మంత్రులను ఆదేశించారు. తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్ చేయాలని, నిపుణులతో మార్గదర్శకాలు తయారు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.