నిజామాబాద్ ఎన్నిక వాయిదా పడుతుందా ? కారణాలు

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 12:55 AM IST
నిజామాబాద్ ఎన్నిక వాయిదా పడుతుందా ? కారణాలు

నిజామాబాద్‌ ఎన్నికల సంఘం అధికారులకు లోక్ఎ సభ ఎన్నిక కత్తిమీద సాములా మారింది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో… బ్యాలెట్ పద్ధతినే ఎన్నిక జరపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా నోటాతో కలిపి… 16 మంది అభ్యర్థులకు ఒక ఈవీఎం ఏర్పాటు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ మంది ఉంటే మరో ఈవీఎంను కలుపుతున్నారు. 2006 నుంచి 2010 వరకు ఉన్న ఎం-2 ఈవీఎంల్లో నాలుగింటిని లింక్ చేయడం ద్వారా… 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఇబ్బంది లేకుండా పోయింది. 

2013 తర్వాత ఎం-3 ఈవీఎంలను వాడుతున్నారు. వాటిలో 384మంది  అభ్యర్థుల పేర్లు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ.. తెలంగాణలో ECIL తయారు చేసిన ఎం-2 ఈవీఎంల వినియోగం ఎక్కువగా ఉంది. BEL కంపెనీ తయారు చేసిన ఎం-2 మెషిన్లయితేనే 386 మంది వరకు పోటీలో ఉన్నా వాటిని వినియోగించవచ్చు. కానీ అవన్నీ వేర్వేరు నియోజకవర్గాలకు పంపించేశారు. దీంతో… వాటన్నింటిని ఇప్పటికిప్పుడు సమీకరించటం సాధ్యంకాదని అధికారులు తేల్చేశారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని మోదకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,033 మంది పోటీ చేశారు. అప్పట్లో బ్యాలెట్‌ పేపర్‌ను బుక్‌లెట్‌గా ముద్రించాల్సి వచ్చింది.

నిజామాబాద్‌లో ఎం3 ఈవీఎంలను వినియోగిస్తేనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలు అంతగా కనిపించడం లేదు కాబట్టి బ్యాలెట్‌ పేపర్‌కు వెళ్లాల్సిందే. అయితే… గవర్నమెంట్ ప్రెస్‌లో ఇంత పెద్ద సైజు బ్యాలెట్ పేపర్‌ను ప్రింట్ చేసే అవకాశం లేదు. ప్రైవేట్‌ ప్రింటర్స్‌ను ఆశ్రయించాల్సిందే. 2 వేల బ్యాలెట్‌ బాక్స్‌ల తయారీతోపాటు 18 లక్షల బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాల్సి ఉంటుంది. పైగా ఒక్కో పేపర్ సైజ్ భారీగా ఉంటుంది కాబట్టి సాదాసీదా బ్యాలెట్‌ బాక్సులు ఉపయోగించే అవకాశమే లేదు. దీంతో ఖచ్చితంగా భారీసైజువి ఏర్పాటు చేయాలి. బ్యాలెట్‌ పేపర్లు, బాక్సులు సకాలంలో అందుతాయనే భరోసా ఉంటేనే యధావిధిగా ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. లేదంటే నిజామాబాద్ ఎన్నిక వాయిదాపడే అవకాశం ఉంది. 

గుర్తుల విషయంలోనూ గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంది. తెలంగాణ ఎన్నికల సంఘం దగ్గర 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయి. దీంతో.. ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. సమయానికి ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు పైకి చెబుతున్నా లోపల మాత్రం అది ఎంత వరకూ సాధ్యం అనే అనుమానాలు వారికీ ఉన్నాయి. రాష్ట్రమంతా రైతు సమస్యలపై చర్చ మొదలైంది. ఎన్నిక వాయిదా పడితే దేశం దృష్టి నిజామాబాద్‌పై పడటం ఖాయం.