కాళేశ్వరంలో కీలక ఘట్టం : నందిమేడారం రిజర్వాయర్‌ ట్రయల్ రన్

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 03:23 AM IST
కాళేశ్వరంలో కీలక ఘట్టం : నందిమేడారం రిజర్వాయర్‌ ట్రయల్ రన్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. కోట్లాది మంది ప్రజలు…లక్షలాది మంది కార్మికులు…వేలాది మంది ఇంజనీర్ల చిరకాల స్వప్నం నెరవేరే సమయం దగ్గరపడింది. ఈ వర్షాకాలంలోనే పంట పొలాలను గోదావరి జలాలతో తడపాలనే దృఢ సంకల్పంతో అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యే ఘడియలు ఆసన్నమయ్యాయి. ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి మేడారం సర్జ్‌పూల్‌కు జలాల తరలింపు ప్రక్రియ విజయవంతం కావడంతో… నీటి పారుదల అధికారులు రెట్టించిన ఉత్సాహంతో… ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగాన్ని మరింత పెంచారు. ఈ వర్షాకాలంలోనే రైతుల కాళ్ళ దగ్గరికి గోదావరి జలాలను తీసుకురావాలనే ప్రభుత్వ కలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం కొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటుచేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ కు అంతా సిద్ధమైంది. బుధవారం(ఏప్రిల్ 24, 2019) ఉదయం 11 గంటలకు స్విచ్ఛాన్ చేసి భారీ మోటర్‌ను ప్రారంభించనున్నారు. సాంకేతిక ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తవడంతో మొదటి మోటర్ వెట్ రన్ కు ముహూర్తం ఖరారు చేశారు. మోటార్లను ఆన్‌ చేసి నీటిని నందిమేడారం రిజర్వాయర్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వచేసేందుకు మొత్తం 82 మోటర్లను ఏర్పాటుచేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ పంపుహౌజ్‌ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. ఇది ఇలా ఉండగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న 9 టీఎంసీల నీటిలోని 0.25 టీఎంసీల నీటితో 6వ ప్యాకేజ్ పనుల్లో ట్రయల్ రన్ చేపట్టారు. ప్రాజెక్ట్ 5 గేట్లలో ఒక షెట్టర్‌ను పైకి ఎత్తి 3200 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కెనాల్‌లోకి విడుదల చేశారు. ఎల్లంపల్లి నుండి బయటకు దూసుకువచ్చిన నీటిని గ్రావిటీ ద్వారా 1.1 కిలోమీటర్లు తరలించి సుమారు 11 మీటర్ల వ్యాసార్థం కలిగిన జంట టన్నెళ్లలోకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి 9.53 కిలోమీటర్లు తరలించి ప్యాకేజ్-6 సర్జ్‌పూల్‌ను నింపారు.

సర్జ్‌పూల్‌లో అక్కడక్కడ లీకులు ఉండడంతో గజ ఈతగాళ్ళతో లీకేజీలను సరిచేయించారు. దీంతో అధికారులు మరో అడుగు ముందుకేసి…ఎల్లంపల్లి జలాశయానికి చెందిన మరో 2 గేట్లు ఎత్తి రెండో దఫా నీటిని సర్జ్‌పూల్‌లోకి విడుదల చేశారు. అనంతరం సర్జుపూల్‌ మొదటి గేట్ నుండి నీటిని విడుదల చేసి మొదటి పంపులోకి పంపించే ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం వెట్‌రన్ నిర్వహించి నందిమేడారం రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ప్యాకేజ్-6, ప్యాకేజీ-7 ద్వారా 8వ ప్యాకేజీకి తరలించి అక్కడి వరద కాలువ ద్వారా మిడ్ మానేర్‌…అక్కడి నుంచి ఎస్సారెస్పీకి…అటు నుంచి రైతుల పంటపొలాల్లోకి తరలించే అవకాశముంది. ప్రాజెక్ట్‌ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఇటు అధికారులు…అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.