మహిళలకు వరం: వైఎస్సార్ కాపు నేస్తంలో రూ.15వేలు

మహిళలకు వరం: వైఎస్సార్ కాపు నేస్తంలో రూ.15వేలు

‘వైఎస్సార్ కాపు నేస్తం పథకం’ కింద ఆరు లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15వేల చొప్పున సాయం అందిస్తారు. వచ్చే మార్చిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ఏటా రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75వేలు చెల్లిస్తారు. 45 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాపు నేస్తం పథకానికి ప్రభుత్వం రూ.1,101 కోట్లను కేటాయించింది. 

ప్రజా సాధికార సర్వే ఆధారంగా ఆరు లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని తొలుత నిర్ణయించారు. తాజాగా నవశకం పేరుతో ప్రభుత్వం అర్హల పూర్తి వివరాలు సేకరిస్తున్నందున లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా అర్హులు 4.5లక్షల నుంచి 5లక్షల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నవశకంలో నమోదుకాని వారు, సకాలంలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారి కోసం మరోసారి దరఖాస్తులు తీసుకునే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 

పథకానికి నిర్ణయించిన అర్హతలివీ:
>
45-60ఏళ్ల మధ్య వయస్సుండాలి. 
> కుటుంబ ఆధాయం నెలకు రూ.10వేలు(గ్రామాల్లో), పట్టణాల్లో రూ.12వేలు లోపు ఉండాలి. 
> కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఉద్యోగ విరమణ పొంది పింఛను తీసకుంటున్నా అనర్హులు 
> కారు ఉండకూడదు. ఆటో, ట్యాక్సీ ట్రాక్టర్లకు మినహాయింపు. 
> మూడెకరాల్లోపు మాగాణీ లేదా పదెకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి పదెకరాల్లోపు ఉండాలి.