మనసు కవి 'ఆత్రేయ'...

07:30 - May 7, 2016

ఆచార్య ఆత్రేయ... తెలుగు సినిమా పాటల్లోనే కాదు శ్రోతల మదిలో పదిలంగా నిలిచిన 'మనసు' కవి. నాటక రచయితగా కెరీర్‌ ప్రారంభించి నటుడిగా మారిన వైనం, నాటకాల నుంచి సినిమా రంగానికి వచ్చిన తీరు, గీత రచయితగా ఆత్రేయ ప్రస్థానం నేటితరానికి స్ఫూర్తిదాయకం. పాటల్లో స్వీయ అనుభవాలను అక్షరాలుగా మలిచిన ఘనుడు. మాటలు, పాటల రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఆచార్య ఆత్రేయ జయంతి నేడు (శనివారం). ఈ సందర్భంగా 'మనసుకవి' ఆత్రేయ సినీ జీవిత ప్రస్థానం..

నాటకాలతో ప్రసిద్ధి..
1921న నెల్లురు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో మంగళంపాడు గ్రామంలో జన్మించారు. పూర్తి పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. చిన్నప్పట్నుంచి నాటకాలంటే ఇష్టం. మధ్యతరగతి కుటుంబ సమస్యల ఆధారంగా నాటకాలను రాసేవారు. తల్లి సీతమ్మ చిన్నప్పుడే కన్నుమూసింది. ఆ తర్వాత మేనమామ దగ్గర పెరిగిన ఆయన తొలుత 40రూపాయల జీతంతో గుమస్తాగా పనిచేశారు. పెళ్లైయ్యక ఉద్యోగం వదిలేసి నాటకాలపై దృష్టి సారించారు. ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం లేకపోవడంతో టీచర్‌గా కొంత కాలం, నెల్లూరు మున్సిప్‌ కోర్టులో కొంతకాలం, 'జమీన్‌ రైతు', 'స్వర్గ సీమ' పత్రికల్లో కొంత కాలం పనిచేశారు. అయినప్పటికీ నాటకాలను వదులుకోలేదు. 'ప్రవర్తన', 'ఎన్‌.జి.వో' నాటకాలతో ఆంధ్ర నాటక కళా పరిషత్‌ అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 'కప్పలు' అనే నాటకం బాగా ప్రాచూర్యం పొందింది. అప్పట్లో రాయలసీమ కరువు పరిస్థితులను వివరిస్తూ ప్రదర్శించిన 'మాయ', విశ్వశాంతిని కాంక్షిస్తూ 'విశ్వశాంతి', హిందూ, ముస్లింల హింసాకాండను ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన 'ఈనాడు' నాటకాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. నాటకాలు రాయడంతోపాటు నటుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. 'సామ్రాట్‌ అశోక్‌', 'గౌతమ బుద్ధ', 'భయం' వంటి భిన్న నాటకాలను రాశారు. ఈ క్రమంలో సినిమాల్లోనూ సంభాషణలు రాసే అవకాశాలను దక్కించుకున్నారు.

సినీ పాటల ప్రస్థానం..
'దీక్ష' (1950) చిత్రానికి తొలిసారి ఆయన పాటలు రాశారు. 'పోరా బాబు పో..' అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో ఇండిస్టీకి తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన 'సంసారం' చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. 'అర్థాంగి' చిత్రంలో 'రాక రాక వచ్చావు చందమామా..', 'తోడి కోడళ్ళు' చిత్రంలో 'కారులో షికారుకెళ్లి.', 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం'లో 'శీశైలవాసా శ్రీ వెంకటేషా..', 'మంచి మనసులు'ల్లో 'శిలలపై శిల్పాలు చెక్కినారు..', 'మూగ మనసులు' చిత్రంలో 'ముద్దబంతి పువ్వులో..' 'డాక్టర్‌ చక్రవర్తి'లో 'నీవులేక వీణ ..', 'అంతస్తులు'లో 'తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము..', 'ప్రేమ్‌నగర్‌'లో 'నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది..', 'మరోచరిత్ర'లో 'ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో..', 'ఇంద్రధనస్సు'లో 'నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి..', 'అంతులేని కథ'లో 'కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు', 'మరోచరిత్ర'లో 'విధి చేయు వింతలన్నీ..', 'ఇది కథ కాదు'లో 'సరిగమలు గలగలలు', 'స్వాతిముత్యం'లో 'చిన్నారి పొన్నారి కిట్టయ్య' తోపాటు 'తేనే మనసులు', 'ప్రైవేట్‌ మాస్టర్‌', 'బ్రహ్మాచారి', 'మట్టిలో మాణిక్యం', 'బడి పంతులు', 'పాపం పసివాడు', 'భక్త తుకారం', 'బాబు', 'జ్యోతి', 'అందమైన అనుబంధం', 'గుప్పెడు మనసు', 'ఆకలి రాజ్యం', 'అభిలాష', 'కోకిలమ్మ', 'అభినందన', 'ప్రేమ' వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని ఆయన సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు.

కథ, మాటల రచయితగా..
పాటల రచయితగానే కాకుండా సినిమాలకు కథలు, మాటలు కూడా అందించారు. 'ముద్దుల మొగుడు', 'వెలుగు నీడలు', 'మూగమనసులు', 'కన్నతల్లి', 'గుమస్తా', 'అర్థాంగి' వంటి చిత్రాలకు రైటర్‌గా పనిచేయగా, 'తోడి కోడళ్ళు', 'మాంగల్య బలం', 'జయభేరి', 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం', 'పెళ్ళి కానుక', 'ఆరాధన', 'వాగ్దానం', 'డాక్టర్‌ చక్రవర్తి', 'జీవన తరంగాలు', 'గుప్పెడు మనసు' వంటి చిత్రాలకు అద్భుతమైన సంభాషణలను సమకూర్చారు. నాటక రచయితగా, నటుడిగా, గీత రచయితగానే కాకుండా 'వాగ్ధానం' చిత్రంతో దర్శక, నిర్మాతగా మరో రెండు బాధ్యతలను నిర్వర్తించారు.

పుస్తక రూపంలో 'ఆత్మకథ'..
అనారోగ్యంతో 1989 సెప్టెంబర్‌ 13న ఆత్రేయ కన్నుమూశారు. ఆత్రేయ పాటలన్ని కలిపి పుస్తక రూపంలో (2007)విడుదల చేశారు. అలాగే తన అనుభవాలను 'ఆత్మ కథ'లో రాసుకున్నారు. పాటలు రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ దర్శక, నిర్మాతలను బాగా ఇబ్బందులు పెట్టారనే విమర్శపై 'వాళ్ళు రాయించుకోవడానికి ఏడుస్తుంటే.. రాస్తూ నేనెంత ఏడుస్తానో ఎవరికి తెలుసు..' అని ఆత్రేయ ఘాటుగా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రేమపాటలు, భక్తిరస గీతాలు, విషాద పాటలు, అమ్మ పాటలు, బావామరదళ్ళ చిలిపి పాటలు, శృంగార గీతాలు, వ్యంగ్య, సందేశాత్మక పాటల్లో నవరసాలను పలికిస్తూ రాయడంలో ఆత్రేయ తర్వాతే ఎవరైనా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అమ్మతో అనుబంధం..
ఆత్రేయ అమ్మ సీతమ్మ. అమ్మ అంటే అమితమైన ప్రేమ. చిన్నతనంలోనే కన్నుమూసింది. ఆమె మరణానికి విష ప్రయోగమనే అపోహ ఆత్రేయ మనసును గాయపర్చింది. అందుకే అమ్మ పాటలు రాసేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యే వారట. 'అమ్మ వంటిది అంత మంచిది.. అమ్మ ఒక్కటే అయ్యేనా జేజైనా అమ్మ పిమ్మటే.. ' అంటూ 'కలిసిన మనసులు' చిత్రంలో అమ్మను అభివర్ణించిన తీరు, 'అమ్మా చూడాలి. నిన్నూ నాన్నను చూడాలి. నాన్నకు ముద్దు ఇవ్వాలి. నీ ఒడిలో నిద్దురపోవాలి..' అంటూ 'పాపం పసివాడు'లో అమ్మ వియోగంతో కుమిలిపోయే ఆర్థ్రగీతం, 'అమ్మంటే అమ్మ, ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ..' అంటూ 'రామ్‌ రహీమ్‌' చిత్రంలో తల్లి విశిష్టతను తెలియజేస్తూ ఆయన రాసిన పాటలు ఇప్పటికీ శ్రోతల్ని కంటతడి పెట్టిస్తాయి.

మూడు పద్మాల ప్రేమ..
ఆత్రేయ స్కూల్‌కెళ్ళే టైమ్‌లో పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించారు. ఆమె ముద్దు పేరు 'బాణ'. గోత్రాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్ళు పద్మావతిని తిరస్కరించారు. ఆ తర్వాత ఆత్రేయ 13వ ఏట తన మేన మరదలైన పద్మావతితో వివాహం చేశారు. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పట్నుంచే కలిసి చదువుకున్నారు. తక్కువ వయస్సులో పెళ్ళి చేసుకోవడం వల్ల ఇరువురు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతేకాదు బాణని మర్చిపోలేకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థాలు కూడా తల్లెత్తాయి. ఓ సారి టైఫాయిడ్‌ జ్వరం రావడంతో నెల్లూరులో హాస్పిటల్‌లో చేశారు. అక్కడ ఆత్రేయకు సపర్యాలు చేసిన నర్సు పేరు కూడా పద్మానే. తనకు ఆమె చేసిన సేవలకు ముగ్దుడైన ఆత్రేయ ఆమె ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోవడంతో ఆత్రేయ ఎంతో బాధపడ్డారు. ఇలా ఆయన జీవితంలో రెండు విషాద ప్రేమకథలున్నాయి. దీనివల్లే ఆత్రేయ విఫల ప్రేమ పాటలు బాగా రాయడానికి స్ఫూర్తినిచ్చాయని అంటుంటారు.

Don't Miss