శ్రావణి హత్య కేసు : 5 టీంలతో దర్యాప్తు – డీసీపీ

  • Published By: madhu ,Published On : April 27, 2019 / 05:00 AM IST
శ్రావణి హత్య కేసు : 5 టీంలతో దర్యాప్తు – డీసీపీ

యాదాద్రి భువనగిరి జిల్లాలో 9వ తరగతి విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు మిస్టరీగా మారింది. 5 టీంలతో దర్యాప్తు చేపడుతున్నట్లు..త్వరలోనే కేసును చేధిస్తామని డీసీపీ వెల్లడించారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం డీసీపీతో 10tv మాట్లాడింది. హత్య ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. 360 డిగ్రీల కోణంలో ఆధారాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. రేప్ చేసి హత్య చేశారని అనుమానం ఉందన్నారు. వైద్యుల నివేదిక రావాల్సి ఉందని..40 నుంచి 50 అడుగుల లోతులో బావి ఉందని.. లోనికి వెళ్లే ఏర్పాట్లు లేవన్నారు. సమీపంలో ఉన్న సీసీ టీవీ కెమెరా వర్క్ చేస్తలేదని.. సర్వీసు ప్రొవైడర్లు వచ్చి రిపేర్ చేయాల్సి ఉందన్నారు.
 
బొమ్మల రామారం మండలం హాజీపూర్‌ గ్రామంలో 9వ తరగతి శ్రావణి విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పాడుబడ్డ బావిలో పూడ్చిపెట్టిన ఘటనల సంచలనం సృష్టిస్తోంది. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బావికి 10 మీటర్ల దూరంలో శ్రావణి స్కూల్ బ్యాగ్‌తో పాటు మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. దీంతో సెల్ టవర్ ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బావి సమీపంలో వినియోగించిన సెల్ నంబర్లపై దృష్టి పెట్టారు. మద్యం బాటిళ్లపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ సేకరించిన పోలీసులు.. అవి ఎవరివనే గుర్తించేపనిలో పడ్డారు. ఈ మద్యాన్ని బొమ్మలరామారంలోని వైన్స్ షాపు నుంచి తెచ్చి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు… ఆ షాపుల సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు.. గ్రామంలో బైక్‌పై అనుమానాస్పదంగా తిరిగి ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.

అయితే.. గ్రామ శివారులోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి క్లూ లభించలేదు. మరోవైపు… లోపలకు దిగే అవకాశమేలేని బావిలోకి నిందితుడు మృతదేహంతో ఎలా దిగాడు.. ఎలా పూడ్చిపెట్టాడు.. ఒక్కడే ఈ పనిచేశాడా? ఎవరైనా సహాయం చేశారా అనే కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 
మరోవైపు… హంతకులెవరో తేల్చేవరకు బాలికకు అంత్యక్రియలు నిర్వహించబోమంటున్నారు గ్రామస్తులు. బాలిక మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు సిద్ధమవుతున్నారు.