వైసీపీ కార్యకర్తలే మా ఇంట్లో చోరీకి వచ్చారు : ట్విస్ట్ ఇచ్చిన కోడెల

  • Published By: madhu ,Published On : August 23, 2019 / 06:04 AM IST
వైసీపీ కార్యకర్తలే మా ఇంట్లో చోరీకి వచ్చారు : ట్విస్ట్ ఇచ్చిన కోడెల

వైసీపీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి.. నా ఇంట్లో చోరీ ఎందుకు చేశాడు ? దీనికి ఎమ్మెల్యే అంబటి సమాధానం చెప్పాలి. తనను వేదనకు.. ఆవేదనకు గురి చేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేశారు. 2019, ఆగస్టు 22వ తేదీ గురువారం అర్థరాత్రి కోడెల ఇంట్లో చోరీ జరిగింది. అసెంబ్లీ ఫర్నిచర్ తోపాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లారు దుండగులు. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ఆయన ఇంట్లో ఉండడం, వీటిని రికవరీ చేసే క్రమంలో దొంగతనం జరగడం చర్చనీయాంశమైంది. దీనిపై కోడెల ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 

గురువారం రాత్రి తనింటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సెక్యూర్టీ వారించినా వినకుండా ఇంట్లోకి చొరబడ్డారు. వారు వైసీపీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు కోడెల. వారికి నా ఇంట్లో ఏం పని అని ప్రశ్నించారు. ఈ చోరీపై డీసీపీతో మాట్లాడినట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఫర్నీచ్ విషయంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, చోరీ చేశారని, దుర్వినియోగం చేశారని ఎన్నో మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఒక్క తప్పు కూడా చేయలేదని స్పష్టం చేశారు.

వృధాగా ఉందని, పాడు కావద్దనే ఉద్దేశ్యంతో తన ఇంట్లో పెట్టుకున్నట్లు వివరించారాయన. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫర్నీచర్ తీసుకెళ్లాలంటూ జూన్ 07వ తేదీన లేఖలు పంపించడం జరిగిందన్నారు. ఏ వస్తువు మిస్ అయిపోయినా.. ఎంత విలువ చేస్తే దానికి సంబంధించిన డబ్బు చెల్లిస్తానన్నారు. చోరీ విషయంలో కుట్ర ఉందని.. ఇది బయటకు తేవాలన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని..దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కోడెల చెప్పారు.