పిల్లల్లో వ్యాధుల నియంత్రణ : రోటావైరస్ వ్యాక్సిన్ ప్రారంభం

  • Published By: veegamteam ,Published On : September 6, 2019 / 02:46 AM IST
పిల్లల్లో వ్యాధుల నియంత్రణ : రోటావైరస్ వ్యాక్సిన్ ప్రారంభం

పిల్లల్లో తీవ్రమైన అనారోగ్యాలను నియంత్రించడంలో రోటావైరస్ వ్యాక్సిన్ ఉత్తమంగా పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే.జోషి తెలిపారు. గురువారం (సెప్టెంబర్ 5, 2019)వ తేదీన తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో హరితప్లాజాలో చిన్నారులకు రోటావైరస్ వ్యాక్సిన్‌ వేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ కే.జోషి మాట్లాడుతూ సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 0-16 ఏళ్ల వయసు పిల్లలకు 12 రకాల వ్యాక్సిన్లను అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఉపకేంద్రాల్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ ఇవ్వడంపై అన్ని విభాగాల సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు సీఎస్ తెలిపారు. 

రోటావైరస్ ద్వారా డయేరియా వ్యాపిస్తుందని, తద్వారా 40 శాతం మంది ఐదేళ్లలోపు పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని, దీనిని అరికట్టే ఉద్దేశంతోనే ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ ద్వారా వ్యాధుల నియంత్రణతోపాటు మరణాల రేటు కూడా తగ్గుతున్నదని చెప్పారు. ప్రభుత్వస్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ శాంతికుమారి మాట్లాడుతూ 2.5 మి.లీ రోటావైరస్‌ వ్యాక్సిన్ 6 మి.లీ ఓరల్ సిరంజితో నోటి ద్వారా చిన్నారులకు ఇస్తామని చెప్పారు.

పిల్లలకు మొదటి సంవత్సరం లోపల రోటా వైరస్ వ్యాక్సిన్ మొదటి మోతాదును ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తంగా నాలుగు వారాల వ్యవధిలో రోటావైరస్ టీకాను మూడు మోతాదుల్లో ఇస్తారని, తద్వారా నవజాత శిశువులు సామూహిక రోగ నిరోధకశక్తి పొందగలుగుతారని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రోటావైరస్ వ్యాక్సిన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు.

Also Read : మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని : మాజీ ప్రియురాలి గొంతుకోశాడు