వలస కార్మికుల కోసం జగన్ సర్కార్  కీలక నిర్ణయం.. కంట్రోల్ రూం ఏర్పాటు

  • Published By: vamsi ,Published On : April 30, 2020 / 01:47 PM IST
వలస కార్మికుల కోసం జగన్ సర్కార్  కీలక నిర్ణయం.. కంట్రోల్ రూం ఏర్పాటు

మరో మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పూర్తి అవుతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్  పూర్తికానున్న సంధర్భంగా మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పూర్తయ్యాక ఏపీలో ఎలాంటి పరిస్థితులు కొనసాగనున్నాయి ఎలాంటి ఆంక్షలు అమలులో ఉండనున్నాయనే విషయంలో ప్రజలకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయనే దానిపై కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు పలు వివరాలు వెల్లడించారు. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్  సడలింపులు ఉంటాయని కృష్ణ బాబు స్పష్టంచేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో గ్రీన్ జోన్‌లో ఉన్న అన్ని ప్రాంతాలలో కార్యకలాపాలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కృష్ణబాబు తెలిపారు.

అయితే రెడ్ జోన్‍‌లలో  మాత్రం కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వలస కార్మికుల విషయంలో కూడా జగన్ సర్కార్  కీలక నిర్ణయం తీసుకున్నట్లు  కృష్ణ బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో ఉన్న వలస కార్మికులు అందరినీ తమ తమ స్వస్థలాలకు పంపుతున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో 60 వేల మందికి పైగా వలస కార్మికులు ఉన్నారు అని తెలిపిన కృష్ణబాబు.. వారందరిని తమ తమ స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.

అంతే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని  ఇక్కడికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే వేరే రాష్ట్రం నుంచి వస్తున్నారు కనుక వారికి వైరస్ సోకే అవకాశం ఉందని ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మన వాళ్ళకి ముందుగా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచిన అనంతరం తమ తమ గ్రామాలకు పంపిస్తామని కృష్ణ బాబు వెల్లడించారు.

ఇక ఏపీకి చెందినవారు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినట్లయితే వారు కంట్రోల్‌ రూం నంబర్‌ 0866-2424680 లేదా apcovid19controlroom@gmail.com ద్వారా సంప్రదించాలని కృష్ణబాబు వివరించారు.