ఓ వైపు భానుడి భగభగ..మరోవైపు అకాల వర్షాలు

  • Published By: madhu ,Published On : May 1, 2020 / 02:59 AM IST
ఓ వైపు భానుడి భగభగ..మరోవైపు అకాల వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వింత వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు భగభగలాడిస్తుంటే..మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకెన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా వైరస్ తో భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. 

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదు కావచ్చని తెలిపారు.

2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలుగా నమోదైంది. పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఎండలు క్రమక్రమంగా ఎక్కువవుతున్నాయి. గురువారం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా..ఆసిఫాబాద్‌ జిల్లాలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

కరోనా వైరస్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువవుతున్నాయి. ఉదయం 10 నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం ఎండ వేడిమి అధికమౌతోంది. ఇక రాత్రి వేళ ఉక్కపోతతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ..కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. 

Also Read | 2017లో 80 కిలోల గంజాయిని పట్టుకున్నారు..ఇప్పుడు దొంగలు ఎత్తుకెళ్లారు