పెళ్లి చేస్తున్నారా? పర్మిషన్ తీసుకున్నారా? 

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 03:53 AM IST
పెళ్లి చేస్తున్నారా? పర్మిషన్ తీసుకున్నారా? 

అసలే కరోనా కాలం.. మీ ఇంట్లో అబ్బాయి లేదా అమ్మాయికి పెళ్లి చేస్తున్నారా? అయితే వెంటనే పర్మిషన్ తీసుకోండి. ఆ తర్వాతే పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి.. ఇప్పటినుంచి పెళ్లి చేయాలంటే రెవిన్యూ కార్యాలయం నుంచి అనుమతి ఉండాల్సిందే. కరోనాకు ముందు పెళ్లంటే.. పందిళ్లు వేయడం, సందడి చేయడం.. విందు వినోదాలు, తాళాలు, తలంబ్రాలతో అంగరంగ వైభవంగా జరుపుకునేవారు. పెళ్లి వేడుకల కోసం భారీగా ఖర్చు పెట్టేవారు. ఇకపై అలా కుదరదు.. కరోనా వైరస్ నేపథ్యంలో అంటువ్యాధుల చట్టం-1897 ప్రకారం వివాహాలకు ముందస్తు దరఖాస్తు తప్పనిసరి. 

ముందుగా రెవిన్యూ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. రెవిన్యూ సిబ్బంది విచారించి ఓకే అంటేనే పెళ్లి చేసేది. అంతేకాదు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. పెళ్లికి 10 లేదా 20మంది హాజరు కావల్సి ఉంటుంది. పెళ్లి జరిగే ప్రాంతాన్ని రెవిన్యూ సిబ్బంది పరిశీలిస్తారు. కలెక్టర్ల సూచనతో క్షేత్ర స్థాయిలో రెవిన్యూ అధికారులు ఈ చర్యలు చేపడతారు. పురోహితుడితో పాటు వరుడు, వధువు తరపున ఎంతమంది పెళ్లికి హాజరవుతారో వారి పేర్లను నమోదు చేయించుకోవాలి. 

వ్యక్తిగత దూరంతో పాటు పెళ్లికి వచ్చే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. ఊరేగింపులు, సామూహిక విందు భోజనాలు సహా ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని హామీ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. పెళ్లికి హాజరయ్యే వధువరుల కుటుంబాలు రెండు ఈ హామీ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.